పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించిన
వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు
ఈడ్చుకెళ్లి అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు
ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో : ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థులపైనా, యువతపైనా లాఠీఛార్జి చేసి బాష్పవాయువు ప్రయోగించడాన్ని నిరసిస్తూ మంగళవారం హైదరాబాద్‌లో వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన లోక్‌భవన్ ముట్టడిపై తెలంగాణ ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించింది. ఖైరతాబాద్ సిగ్నల్ నుంచి విద్యార్థి నేతలు, విద్యార్థులు ముందుకు దూసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దీంతో, వారు అక్కడే రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు అరెస్టులకు పూనుకోవడంతో తోపులాట జరిగింది. ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థి సంఘాల నేతలను, విద్యార్థులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి. అరెస్టు చేసిన వారిని అసిఫ్‌నగర్ స్టేషన్ కు తరలించారు. సాయంత్రం వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
దేశ విద్యార్థుల, యువత రక్తం చూడటమేనా దేశభక్తి? : వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు
ముట్టడినుద్దేశించి ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్, పిడిఎస్‌యు రాష్ట్ర కార్యదర్శి ఎస్.అనిల్, ఎఐఎఫ్‌డిఎస్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం నాగార్జున మాట్లాడుతూ పోరాటానికి దేశవ్యాప్తంగా విద్యార్థులు తమ సంఘీభావాన్ని ప్రకటించారని గుర్తు చేశారు. పార్లమెంట్ మార్చ్ సందర్భంగా ఢిల్లీలో విద్యార్థులు, యువతపై పోలీసులు లాఠీఛార్జి చేసి బాష్పవాయువు ప్రయోగించడం ప్రజాస్వామ్య హక్కులపై దాడని అన్నారు. దేశ విద్యార్థుల, యువత రక్తం చూడటమేనా దేశభక్తి అని ప్రశ్నించారు. నీట్ పేపర్ లీకేజికి, ఈ దాడులకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని లేదా కేంద్ర ప్రభుత్వం ఆయనను కేబినెట్ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ విద్యా విధానం–2020 పేరుతో విద్యారంగాన్ని ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణ దిశగా నడిపించడం వల్లే పరీక్షల నిర్వహణ గాడి తప్పిందని, వరుసగా పరీక్ష పేపర్ల లీకుతో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఉద్యమాలను అణచివేయడం ద్వారా విద్యా సంక్షోభాన్ని దాచిపెట్టలేరన్నారు.








కామెంట్‌లు (0)