మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

TG - వేడెక్కిన రాజకీయ వాతావరణం - బిఆర్ఎస్ నేతల అరెస్టులు

1 గంట క్రితం

TG - Political atmosphere heats up - BRS leaders arrested
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 12:01 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

తెలంగాణ : అసెంబ్లీ పరిణామాలపై కేసులతోపాటు రైతు దీక్షకు సిద్ధమవుతున్న బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టుతో గజ్వేల్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఒకవైపు రైతు సమస్యలపై బిఆర్ఎస్ నాయకులు దీక్షకు సిద్ధమవుతుండగా, మరోవైపు పార్టీ ముఖ్య నేతల అరెస్టులు, కేసులతో నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే ఎర్రవల్లిలోని బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.


మార్కుక్‌ మండలంలో బిఆర్‌ఎస్‌ నాయకులు రైతు దీక్ష చేపట్టేందుకు సిద్ధమయ్యారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్వహించనున్న ఈ దీక్ష నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. దీక్షకు హాజరుకాకుండా పలువురు బిఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి గజ్వేల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నేతల అరెస్టులతో గజ్వేల్‌ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. రైతుల సమస్యలపై శాంతియుతంగా నిర్వహించనున్న దీక్షను అడ్డుకోవడం సరికాదని బిఆర్‌ఎస్‌ నాయకులు మండిపడుతున్నారు. రైతుల సమస్యలపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.


ఎర్రవెల్లిలో భారీ పోలీసు మోహరింపు ....

మరోవైపు ఎర్రవెల్లిలోని బిఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ నివాసం చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఎర్రవెల్లి పరిసరాల్లోనూ రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోమవారం చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు కూడా రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు మొత్తం ఐదు కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌ కుమార్‌రెడ్డిపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఉదయం వారిని పోలీసులు అరెస్టు చేసి నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇద్దరిపై బిఎన్‌ఎస్‌ సెక్షన్‌ 352, 3(5), ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని సెక్షన్‌ 3(1)(r), 3(2)(va), 3(2)(vii) కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


హరీష్ రావు, కెటిఆర్ సహా పలువురిపై కేసులు ....

పోలీసు అధికారులపై దాడి చేసి దూషించారనే ఆరోపణలతో బిఆర్‌ఎస్‌ నేతలు హరీష్ ‌రావు, కెటిఆర్‌తో పాటు పలువురు బిఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులపైనా కేసులు నమోదయ్యాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పెట్రోల్‌ పోసుకుని హంగామా చేశారన్న ఆరోపణలతో ఆప్‌ కార్యకర్త హేమచంద్రపై కేసు పెట్టారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్