న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రైవేట్ భాగస్వామ్యంతో పనిచేస్తోందని చైర్మన్ వి. నారయణన్ పేర్కొన్నారు. సోమవారం బెంగళూరులో జరిగిన ఒక ఎక్స్‌పోలో ఆయన మాట్లాడారు. ఇస్రోను ప్రైవేటీకరణ చేయడం లేదని, కానీ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందాల్సి వుందని, ఆదిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను విస్తరించేందుకు తాము ప్రైవేట్ రంగంతో కలిసి పనిచేస్తున్నామని అన్నారు. ‘‘నా సహచరులకు కొన్ని ఆందోళనలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయడం మా బాధ్యత. ఇస్రో ప్రైవేటీకరణ కావడం లేదు. ఇది ఒక ప్రభుత్వ సంస్థ. ప్రభుత్వ పెట్టుబడులతోనే పనిచేస్తోంది. అయితే అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందాలి. ఇందుకోసం ప్రైవేట్ భాగస్వామ్యంతో పనిచేస్తాం ’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం అంతరిక్షంలో ఇస్రోకు చెందిన 56 ఉపగ్రహాలు ఉన్నాయని, అయితే ఏడాదికి 50 ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉందని నారాయణ్ తెలిపారు.
ఇస్రో నుంచి పిఎస్‌ఎల్‌వి లేదా జిఎస్‌ఎల్‌వి రాకెట్ ప్రయోగం జరిగినప్పుడు, ఆ రాకెట్‌కు సంబంధించిన ప్రతిదీ ఇస్రోలోనే తయారవుతుందని భావించకూడదని చైర్మన్ ఎస్. నారాయణన్ పేర్కొన్నారు. ఇస్రో తన బడ్జెట్‌లో దాదాపు 80 శాతం నిధులను పరిశ్రమల ద్వారా పనులు చేయించేందుకు వినియోగిస్తోందని, రాకెట్ల తయారీ, విడిభాగాలు, పరికరాలు, వివిధ సాంకేతిక పనుల్లో ప్రైవేట్ పరిశ్రమలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం అవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం సుమారు 450 పరిశ్రమలు ఇస్రోతో కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. అంటే భారత అంతరిక్ష కార్యక్రమాల్లో ఇస్రోతో పాటు ప్రైవేట్ పరిశ్రమల భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరిగిందని ఆయన స్పష్టం చేశారు. అధునాతన అంతరిక్ష పరిశోధనల విషయంలో భారతదేశపు ప్రధాన సంస్థగా తాము కొనసాగుతామని, అలాగే ప్రైవేట్ రంగ భాగస్వామ్యం అనేది తమ పాత్రను తగ్గించే ఉద్దేశంతో కూడుకున్నది కాదని చైర్మన్ వెల్లడించారు.
ప్రైవేట్ పరిశ్రమల భాగస్వామ్యంతో పనిచేస్తాం: ఇస్రో చైర్మన్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 12:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)