తెలంగాణ : హైదరాబాద్ నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందడి ప్రారంభమైంది. లక్షా నలభై వేల గణేష్ మండపాలు సిద్ధమవుతున్నాయని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిపి సజ్జనార్ కీలక ట్వీట్ చేశారు. ఆన్‌లైన్‌లో గణేష్ మండపాల నమోదు తప్పనిసరి అని స్పష్టం చేశారు. వినాయక మండపాల వివరాలను ఉత్సవ నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తుగానే ఆన్‌లైన్ ద్వారా నమోదు (ఇంటిమేషన్) చేసుకోవాలని ఆయన ట్వీట్ చేశారు.
‘‘నిర్వాహకులు వెంటనే http://policeportal.tspolice.gov.in/index.htm పోర్టల్‌ను సందర్శించి తమ వివరాలను నమోదు చేసుకోవాలి. తుది నిమిషం వరకు వేచిచూడకుండా అధికారిక పోర్టల్ ద్వారా సమాచారం అందించి హైదరాబాద్ సిటీ పోలీస్‌కు సహకరించాలి. మండపాల ఏర్పాటు, నిమజ్జన వివరాలు ముందుగానే తెలిస్తే ఆయా ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, తగిన భద్రతా ఏర్పాట్లు చేసేందుకు యంత్రాంగానికి వీలవుతుంది’’ అని సజ్జనార్ పేర్కొన్నారు.
మరోవైపు, గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో డీజేల మోత మోగిస్తే సహించేది లేదని పోలీసులు స్పష్టం చెప్పారు. శబ్ద కాలుష్యంతో వృద్ధులు, గర్భిణులు, నవజాత శిశువులు తీవ్ర అనారోగ్యానికి గురవుతుండటంపై దాఖలైన పిటిషన్లను పరిశీలించిన తెలంగాణ హైకోర్టు.. నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో పోలీసులు ఈ దిశగా దృష్టి సారించారు.
ఈ ఏడాది ఉత్సవ కమిటీలకు పోలీసుల అనుమతి లభించాలంటే కఠినమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. మండపంలో శబ్ద పరిమితులు దాటవని, రాత్రి 10 గంటల తర్వాత మైకులు ఆపివేస్తామని నిర్వాహకులు రాతపూర్వక పత్రం సమర్పించాలి. డీజే, సౌండ్ సిస్టమ్స్ సరఫరా చేసే యజమానులకు ముందస్తుగానే పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు.
గతేడాది గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు. గతేడాది శబ్ద కాలుష్య నియమావళిని దాటిన వారిపై 250కి పైగా కేసులు నమోదు చేయగా, 150కి పైగా భారీ డీజే సెట్లు, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈసారి ఉల్లంఘనలకు పాల్పడితే డీజే పరికరాలతో పాటు రవాణా చేసిన వాహనాలను కూడా జప్తు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.








కామెంట్‌లు (0)