ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

వినాయకచవితి సమీపిస్తోంది.. గణేశ్ విగ్రహ తయారీదారులకు సిపి హెచ్చరిక

1 రోజు క్రితం

Vinayaka Chavithi is approaching... CP issues warning to Ganesh idol makers.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 31, 2026, 09:10 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : గణేశ్ విగ్రహాల గరిష్ట ఎత్తు 16 అడుగులకు పరిమితం చేయాలని తయారీదారులను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశించారు. వినాయక చవితి సమీపిస్తున్న వేళ ... విగ్రహాల తయారీ దశ నుంచే భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించాలని వారికి స్పష్టం చేశారు. గణేశ్ ఉత్సవాలపై హైదరాబాద్ పోలీసులు ముందస్తు సన్నాహాలు చేస్తున్నారు. అందుకోసం గురువారం నగర సీపీ వీసీ సజ్జనర్ అధ్యక్షతన విగ్రహ తయారీదారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రశాంతంగా, సురక్షితంగా, పర్యావరణహితంగా ఉత్సవాలు నిర్వహించడమే లక్ష్యమని ఈ సందర్భంగా వారికి సీపీ స్పష్టం చేశారు. గతేడాది హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 23 వేల గణేశ్ విగ్రహాలను ప్రతిష్టించినట్లు వివరించారు. విగ్రహాల రవాణా సమయంలో గతేడాది నాలుగు ప్రమాదాలు జరిగాయని నగర సీపీ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తప్పని సరి అని వారికి సూచించారు. మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలని తయారీదారులను కోరారు. చిన్న విగ్రహాల ప్రతిష్టాపనపై యాత్రికులకు అవగాహన కల్పించాలని వివరించారు. విగ్రహాల తయారీ కేంద్రాల్లో ఫైర్ సేఫ్టీ, సురక్షితమైన విద్యుత్ వైరింగ్ నిబంధనను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ధూల్‌పేట్, జల్‌పల్లి, మైలార్‌దేవ్‌పల్లి నుంచి విగ్రహాల రవాణాకు ప్రత్యేక ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు ఏర్పాటు చేయాలన్నారు. రద్దీ సమయాల్లో భారీ విగ్రహాల రవాణాను నివారించాలని ఆదేశించారు. రవాణాకు ముందు స్థానిక ట్రాఫిక్ పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. విగ్రహాల బుకింగ్, రవాణా సమయం, మార్గాల వివరాలు ముందుగానే పోలీసులకు ఇవ్వాలని తయారీదారులను ఆదేశించారు. భారీ విగ్రహాల రవాణాలో విద్యుత్ తీగలు, ఫ్లైఓవర్లు, మెట్రో మార్గాలకు ఆటంకం కలగకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. లోడింగ్, అన్‌లోడింగ్‌కు ఉపయోగించే క్రేన్లు, వాహనాలు సర్టిఫైడ్ అయి ఉండాలని వారికి స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని వినాయకుని విగ్రహాల తయారీదారులను నగర సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్