బుధవారం, 11 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాంగ్ రూట్ లో వచ్చిన ఉద్యోగి - ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

6 గంటల క్రితం

Employee and engineering student killed after traveling in the wrong direction
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 11:51 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

తెలంగాణ : రాంగ్‌ రూట్‌ లో బైక్‌ నడిపిన ఎస్బీఐ ఉద్యోగి నిర్లక్ష్యం ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థిని నిండు ప్రాణం తీసింది. తండ్రితో కలిసి కళాశాలకు వెళ్తున్న 21 ఏళ్ల యువతి.. ఎదురుగా వేగంగా వచ్చిన అతడి బైక్ ను తప్పించే క్రమంలో వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు కిందపడిపోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన యువతి అక్కడిక్కడే మృతి చెందింది. హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ... పాతబస్తీలోని హఫీజ్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ ఆరీఫ్‌ కుమార్తె షేక్‌ ఆయిషా ముస్ఫిరా (21) ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీఈ మైనింగ్‌ మూడో సంవత్సరం చదువుతోంది. సోమవారం ఉదయం ఆరీఫ్‌ తన కుమార్తెను బైక్ పై కళాశాలకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో ఫీవర్‌ ఆసుపత్రి సిగ్నల్స్‌ వద్ద షైలా కేఫ్‌ సమీపానికి చేరుకున్నారు. అదే సమయంలో ఎదురుగా రాంగ్‌ రూట్‌లో మరో వ్యక్తి వేగంగా బైక్‌పై దూసుకొచ్చాడు. దీంతో ఆరీఫ్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేయడంతో ఆయన ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి ఎడమవైపు పడిపోయింది. ఆయిషా మాత్రం కుడివైపు రోడ్డుపై పడిపోయింది. అప్పటికే వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కింద ఆమె పడిపోయింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై ఆయిషా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.


రాంగ్‌ రూట్‌లో వచ్చిన ఎస్బీఐ ఉద్యోగి అరెస్ట్‌ ...

ఈ ప్రమాదానికి కారణమైన వ్యక్తిని ఎస్బీఐ ఉద్యోగి బీఎం ధర్మరాజుగా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనపై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ తీవ్రంగా స్పందించారు. బాధ్యత గల హోదాలో ఉన్న బ్యాంకు ఉద్యోగి రాంగ్‌ రూట్‌లో ప్రయాణించి, ఉజ్వల భవిష్యత్తు ఉన్న 21 ఏళ్ల ఇంజినీరింగ్‌ విద్యార్థిని జీవితాన్ని నడిరోడ్డుపై ముగించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో మైనింగ్‌ ఇంజినీరింగ్‌ చదువుతూ భవిష్యత్తులో ఇంజినీర్‌గా దేశానికి సేవ చేయాలని ఐషా ఎన్నో కలలు కన్నదని సజ్జనార్‌ పేర్కొన్నారు. అయితే రాంగ్‌ రూట్‌లో వచ్చిన నిర్లక్ష్యపు బైక్‌ కారణంగా ఆమె ఆశలన్నీ క్షణాల్లోనే ఆవిరయ్యాయని తెలిపారు. కుమార్తెను కళాశాలకు తీసుకెళ్తున్న ఆ తండ్రి.. కళ్ల ముందే బిడ్డ ప్రాణాలు కోల్పోవడంతో తల్లడిల్లిపోయారని సజ్జనార్‌ పేర్కొన్నారు. అప్పటివరకు నవ్వుతూ మాట్లాడిన కుమార్తె విగతజీవిగా రోడ్డుపై పడి ఉండటాన్ని చూసి ఆ తండ్రి నిస్సహాయంగా రోదించిన తీరు అక్కడున్న వారందరినీ కలచివేసిందన్నారు. కేవలం రెండు నిమిషాలు ఆదా చేసుకోవాలనే తొందరపాటు మరొకరి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపుతోందని సజ్జనార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో బాధ్యతగా ఉండాల్సిన విద్యావంతులే ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, తాము తీసుకునే రాంగ్‌ రూట్‌ మరొకరి జీవితానికి రాంగ్‌ ఎండ్‌ కాకూడదని ఆయన హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలను బలితీసుకోవద్దని సూచించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్