- మంత్రి అనగాని సత్యప్రసాద్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : భూములపై ప్రజల హక్కులను పరిరక్షించడంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ప్రజల ఆస్తులకు సంపూర్ణ భద్రత కల్పించడమే లక్ష్యంగా గత రెండేళ్లలో రెవెన్యూ, స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ శాఖల్లో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేసినట్లు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. భూ పరిపాలన వ్యవస్థను ఆధునీకరించి, ప్రజల హక్కులకు భద్రత, సేవల్లో పారదర్శకత, రికార్డుల్లో ఖచ్చితత్వం తీసుకొస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా గతంలో నిర్వహించిన రీ-సర్వేపై వచ్చిన వేలాది ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని గ్రామాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెల 9వ తేదీన గ్రామస్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరిస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.04 లక్షల ఎకరాలకు సంబంధించిన భూ వివాదాలను గుర్తించి వాటి పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. భూ హక్కుల భద్రతలో భాగంగా ఇప్పటివరకు 24 లక్షలకుపైగా కొత్త పట్టాదారు పాస్‌బుక్కులు జారీ చేశామని, త్వరలో మరో 1.90 లక్షల పాస్‌బుక్కులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. క్యూఆర్ కోడ్ ఆధారిత భద్రతా వ్యవస్థతో వీటిని రూపొందించడం వల్ల నకిలీలకు అడ్డుకట్ట పడుతుందని పేర్కొన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్లు, నకిలీ లావాదేవీలను నివారించేందుకు భూ యజమాని అనుమతి లేకుండా ఎటువంటి ఆస్తి బదిలీ జరగకుండా “డిజిటల్ లాకింగ్” వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రతి రిజిస్ట్రేషన్‌కు ఒటిపి ఆధారిత ధృవీకరణను తప్పనిసరి చేసినట్లు చెప్పారు. వాట్సాప్ ఆధారిత సేవల ద్వారా మ్యూటేషన్ దరఖాస్తులు, భూ వివరాల ధృవీకరణ వంటి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు.
రిజిస్ట్రేషన్ పూర్తైన వెంటనే మ్యూటేషన్ స్వయంచాలకంగా జరిగే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఆటో మ్యూటేషన్ వ్యవస్థ అమలు చేస్తున్నామని తెలిపారు. భూ ఆక్రమణలు, నకిలీ పత్రాలు, ప్రభుత్వ భూముల దుర్వినియోగం, భూ మాఫియా కార్యకలాపాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. పరిశ్రమల శాఖకు 12,142 ఎకరాలు, పునరుత్పాదక ఇంధన సంస్థలకు 40 వేల ఎకరాలు, పర్యాటక రంగానికి 470 ఎకరాల భూమిని కేటాయించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం, రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో 100 శాతం పట్టాదారు పాస్‌బుక్కుల పంపిణీ, అన్ని భూ రికార్డులను డిజిటల్ లాకింగ్ పరిధిలోకి తీసుకురావడం, రెవెన్యూ సేవలను పూర్తిగా పేపర్‌లెస్ విధానంలోకి మార్చడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.








కామెంట్‌లు (0)