శుక్రవారం, 03 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

‘తోతాపురి’ రైతులకు కేంద్రం అండగా నిలవాలి

4 రోజుల క్రితం

cm chandrababu rythu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 09:50 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ధరల లోటు చెల్లింపు పథకం అమలు చేయాలి

- 7.03 లక్షల టన్నుల కొనుగోళ్లకు రూ.281 కోట్ల ఆర్థిక సహకారం

- కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సిఎం చంద్రబాబు లేఖ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని అధిగమించేందుకు చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు, ముఖ్యమంత్రి ఆదివారం లేఖ రాశారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీం (మార్కెట్ జోక్యం ద్వారా ధరల లోటు చెల్లింపు పథకం) అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ పరిణామాలతో మ్యాంగో పల్ప్ ఎగుమతులు నిలిచిపోవడం, పరిశ్రమలు కొనుగోళ్లు నిలిపివేయడంతో మార్కెట్‌లో తోతాపురి ధరలు పడిపోయాయని లేఖలో పేర్కొన్నారు. మామిడి రైతులను ఆదుకునేందుకు కేంద్రం రూ.281 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు. దేశంలోనే మామిడి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని, రాష్ట్రవ్యాప్తంగా 3.99 లక్షల హెక్టార్లలో సాగవుతూ 52.65 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోందని వివరించారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాల్లో దాదాపు 91,011 హెక్టార్లలో తోతాపురి రకం సాగవుతోందని తెలిపారు. దీని ద్వారా 8.65 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తూ లక్షలాది రైతు కుటుంబాలకు జీవనాధారంగా ఉందని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత సీజన్‌లో పెట్టుబడి వ్యయం పెరగడం, మార్కెట్‌లో ధరలు కుప్పకూలడంతో మామిడి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని వివరించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని 7.03 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి కొనుగోళ్లకు మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. దీంట్లో భాగంగా కిలోకు అదనంగా రూ.4 చొప్పున మామిడి రైతులకు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ మేరకు ‘ధరల లోటు చెల్లింపు పథకం’ కింద కేంద్రం మద్దతివ్వాలని, ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు జరిగే ఈ కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీంను అమలు చేసేలా చూడాలని.. లేఖలో కేంద్రమంత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్