గురువారం, 02 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆర్‌‌టిసి పరిరక్షణకు రెండోదశ ఉద్యమం

3 రోజుల క్రితం

rtc jac
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 07:33 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఆర్టీసి ఉద్యోగ సంఘాల జెఎసి

ప్రభుత్వం స్పందించకపోతే జులై 30న మూడోదశ ప్రకటన

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఎపిఎస్‌ ఆర్‌‌టిసి పరిరక్షణకు రెండోదశ ఆందోళన చేపట్టనున్నట్లు ఎపిపిటిడి(ఆర్‌‌టిసి) ఉద్యోగ సంఘాల జెఎసి ప్రకటించింది. ఆదివారం ఉదయం విజయవాడలోని రెవెన్యూ భవన్లో ఆర్‌‌టిసి ఉద్యోగ సంఘాల జెఎసి సమావేశం జరిగింది. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో జెఎసి కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు, కో-కన్వీనర్లు పి.వి.రమణారెడ్డి, జి.వి.నరసయ్య, సిహెచ్.సుందరయ్య, ఎస్.వి. శేషగిరిరావు, శ్రీనివాసరావు, కె.సూర్య ప్రకాశరావు, డి.మాల్యాద్రి మాట్లాడారు. విద్యుత్ బస్సుల పేరుతో ప్రవేటు ఆపరేటర్లకు అవకాశం కల్పిస్తూ వేలకోట్లు విలువైన డిపో స్దలాలను ప్రైవేటు బస్సు ఆపరేటర్లకు లీజుపేరుతో కట్టబెట్టి దశలవారిగా ఆర్టీసీని ప్రవేటుపరం చేయాలన్న ప్రభుత్వం ఆలోచనలు విరమించుకోవాలని డిమాండు చేశారు. సంస్ద పరిరక్షణ, ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం, పిటిడి(ఆర్టీసి) ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసి ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రెండవ దశ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, రవాణా శాఖ మంత్రి, రవాణాశాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ, ఆర్టీసీ ఎమ్‌‌డిలకు ఈ నెల 29వ తేదీ సోమవారం వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ శాంతియుత ఆందోళన చేసినా స్పందన లేదని, అందువల్లే రెండోదశలో తీవ్రతరం చేస్తామని, స్పందించకపోతే మూడోదశ కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. జులై 7, 8 న రెండురోజులు “ఏపీఎస్ ఆర్టీసీ పరిరక్షణ దినం” గా పాటిస్తూ ఉద్యోగులందరూ డిమాండ్లతో కూడిన ప్రింటెడ్ బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తారని తెలిపారు. జూలై 9 నుండి 18 వరకు ప్రజాప్రతినిధుల మద్దతు కోరే కార్యక్రమం ఉంటుందని, దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను కలిసి, ప్రవేటు విద్యుత్‌ బస్సుల వల్ల ప్రజా రవాణా వ్యవస్థపై పడే ప్రతికూల ప్రభావాలు, డిపోలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల ప్రజలకు ఉద్యోగులకు కలిగే నష్టాలను వివరిస్తామని తెలిపారు. సంస్థ బాగుకోసం వారి మద్దతు, సహకారం కోరతామని వివరించారు. జూలై 19 నుండి 26 వరకు ముఖ్యమంత్రికి ఉద్యోగుల ఆవేదనను తెలియజేస్తూ రూపొందించిన వినతిపత్రాలపై ఉద్యోగులందరితో సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. జూలై 27న గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ల ద్వారా ఉద్యోగుల సంతకాల సేకరణతో కూడిన వినతిపత్రాలను అందిస్తామని వివరించారు. జూలై 30న జేఏసీ రాష్ట్ర స్దాయి సమావేశం విజయవాడలో నిర్వహించి, మూడవ దశ ఉధ్యమక కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్