గురువారం, 02 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఈ ఇల్లంతా నాదేలే!

2 గంటల క్రితం

kavitha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 02, 2026, 04:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

నల్లపిల్లి ఒక్కటుంది

చప్పుడేమి చేయకుంది

మెత్తనైన పాదాలతో

రాత్రి వేళ తిరుగుతోంది!

గాజులాటి కళ్ళతోటి,

ఇల్లంతా వెతుకుతోంది

ఆకలితో మ్యావ్ అంటూ

సన్నగా పలుకుతోంది!

గదికొక్క కన్నముంది

అందులో ఎలుక ఉంది

నాలుగు పిల్లలని కని

చల్లంగా బతుకుతోంది!

మాయదారి మార్జాలము

ఈ ఇంటికే రావలెనా?

నన్ను, పిల్లలని చూస్తే

ఫలహారం అయిపోమా!

అనుకుంటూ ఎలుకమ్మ,

భయంతో బతుకుతోంది

పిల్లి బాధ తప్పేందుకు

ఉపాయం వెతుకుతోంది!

బాధలేని చోటు కొరకు

అన్నిచోట్ల తిరుగుతోంది

మరో పక్క పిల్లి కంట

పడకుండా మసలుతోంది!

‘ఎలుకమ్మా ఎందుకంత

ఆందోళన చెందుతావు?

నీకొచ్చిన ఆపదేంటో

వివరంగా చెప్పు నాకు’

అన్న కాకి మాటలకు

తల్లడిల్లె చిట్టెలుక

పిల్లి సంగతిని చెప్పి

బోరుమంది పట్టలేక ...

‘దీనికింత భయమేలా?

ఉపాయమ్ము ఉంది కదా!

పిల్లి వచ్చే ముందు నీవే

పాలుగిన్నె తిరగగొట్టు

నువ్వా పని చేసినట్టు

ఎవ్వరికీ తెలియరాదు

ధైర్యము నీతోనేవుంటే

అపాయం దరిచేరదు’

విషయమ్ము తెలిసింది

వివేకంతో నడిచింది

బిడాలము వచ్చె ముందే

గిన్నెలు పడగొట్టింది!

ఇంట్లో వారంతా వచ్చి

పిల్లినేమో చూసినారు

మాయదారి పిల్లి అంటూ

తన్ని తరిమేసినారు

పిల్లి బెడద తొలగిపోయె

ఎలుకకు సంతోషమాయె

ఇల్లంతా నాదేనని

పాడుకుంటూ మురిసిపోయే!


- కూచిమంచి నాగేంద్ర,

ఈస్ట్ పాయింట్ కాలనీ, విశాఖ,

91821 27880.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్