గురువారం, 02 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమోడీ మనోడేలే, ఫోన్‌ కొట్టు!

1 గంట క్రితం

avi ivi - modi trump - gor
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 02, 2026, 05:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఎప్పుడేం చేస్తాడో తెలియదని ప్రపంచ దేశాలన్నీ గోల పెడుతున్నాయి. ఎప్పుడూ వారికి నమ్మకమైన మిత్ర దేశాలుగా వున్నవీ హడలిపోతున్నాయి. తాజాగా ఇరాన్‌ యుద్ధం తర్వాత గల్ఫ్‌ దేశాలు కూడా విడగొట్టుకోవడానికి సిద్ధమైనాయి, నాటో కూడా నిష్టూరాలు పలుకుతున్నది. కాని ఇంతటి అలజడి లోనూ దోస్త్‌ మేరా దోస్త్‌ తూ హై మేరా జాన్‌ అని పాడుతున్న నెచ్చెలి ఎవరంటే మరెవరో కాదు. ఘనత వహించిన భారత ప్రధాని గారే. ఈ విషయం అంతర్జాతీయ వేదికపై ప్రకటిస్తున్నారు ఇండియాలో ఆ దేశపు రాయబారి సెర్గియో గోర్‌. భారత అమెరికా మిత్రమండలి సమావేశంలో ఈ ముచ్చట చెప్పారాయన. ఏమంటే మియామిలో ఏదో ఒక అంతర్జాతీయ సమావేశం మధ్యలో ట్రంప్‌ మోడీకి ఫోన్‌ కొట్టు అన్నారట. సార్‌ ఇప్పుడు అక్కడ ఉదయం ఆరు గంటలే. తర్వాత చేయొచ్చు. అని గోర్‌ చెప్పాడట. అయితే అదేం లేదు ఫోన్‌ కొట్టు. మోడీ కూడా నాలాగే. మాట్లాడటానికి ఎప్పుడైనా రెడీగా వుంటాడు. నా జిగ్రీ దోస్త్‌. అని ట్రంప్‌ స్నేహ గీతం పాడాడట. వాస్తవానికి ఆ ఫోన్‌ చేయవలసింది కూడా మరుసటి రోజట. గోర్‌ ఈ ముచ్చట చెప్పి స్నేహం గట్టిగా వుండాలేగానీ షెడ్యూలు కాస్త అటూ ఇటూ అయితే పెద్ద సమస్య కాదు. తన మొదటి ఎన్నిక కాలంలో జరిపిన భారత పర్యటననే ట్రంప్‌ ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంటాడు అని ముక్తాయించారట. ఇందుకు పూర్తి విరుద్ధంగా డెమోక్రటిక్‌ పార్టీ సెనేటర్‌ రావ్‌ కన్నారావు మాట్లాడారు. ఇరు దేశాల సంబంధాలు ఇప్పుడున్నంత అధ్వాన్నంగా ఎప్పుడూ లేవు. ట్రంప్‌కు ఏదీ అర్థం కాదు అని కొట్టిపారేశారు. అయితేనేం, మోడీజీ భలే చేశాడని ఆయన శిష్యులు సంతోషమే సంతోషం.

మీ నాన్న ఓటు చేశాడా?

పచ్చబొట్టు చెదిరిపోదులే నా రాజా అని పాట పాడినట్టు ఓటు గుర్తు చెదిరిపోదులే అని ఎన్నికల సంఘం నమ్ముతున్నట్టు కనిపిస్తుంది. 2002లో ఓటు తాలూకూ ఆనవాలు చూపించమంటుంది. అప్పటికి నేను పుట్టలేదు. నాకు పెళ్లి కాలేదు. అప్పుడు ఈ చిరునామాలో లేను. ఇలా ఏం చెప్పినా సరే. అయితే అది రుజువు చేసే పత్రాలు చూపించు అని అడుగుతుంది. మామూలుగా రెన్యూవల్‌కు ఇంతకు ముందు సంవత్సరం అడుగుతారు. ఇంతకు ముందు ఎన్నికలను అడగొచ్చు, కానీ ఏకంగా ఇరవయ్యేళ్ల నాటి దాఖలాలు అడిగితే ఎలా తేవడం? ఉదాహరణకు అప్పుడు నీవు కాకుంటే మీ నాన్న ఓటు వేసినట్టు ఆధారం లేదే అని చాలా మందికి ఓటు తిరస్కరిస్తున్నారు. నాన్న కూడా బదిలీల అయివుండొచ్చు. ఓటు వేసిన గుర్తు తీసిపెట్టుకుని వుండకపోవచ్చు. పేరెంట్స్‌ అంటే అమ్మ నాన్న అయినా నాన్నదే వుండాలని పట్టుపట్టడం కూడా చాలాసార్లు సమస్యలకు దారితీస్తున్నది. ఇంటి పేరు మార్పు, ఇరుగు పొరుగు వారిలా లేకపోవడం, స్పెల్లింగులో తేడా వంటివన్నీ ఓటు హక్కుకు ఎసరు పెడుతున్నాయి. ఒక చోట కాదు ఢిల్లీ, పంజాబ్‌, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ ఇలా అని చోట్ల కొద్ది రోజుల్లోనే ఈ సమస్యలు ఠారెత్తిస్తున్నాయి. యూజర్‌ ఫ్రెండ్లీగా రూల్స్‌ లేకపోవడమే కారణం. అందుకే 'సర్‌' విషయంలో జోక్యం చేసుకోవలసిందిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి 23 పార్టీల నాయకులు లేఖ రాశారు. వాస్తవానికి తమిళనాడు, బెంగాల్‌ అనుభవాల తర్వాత దేశమంతటా దీనిపై భయాందోళనలు వ్యక్తమైనా స్వయంగా అనుభవంలోకి రాలేదు గనక చదువుక్నునవారు కూడా సీరియస్‌గా తీసుకోలేదు. ఇప్పుడు మాత్రం చాలా ఆగ్రహావేదనలు వ్యక్తం చేస్తున్నారు. రెండు చోట్ల ఓటు వుంటే తీసేయవలసిందే గాని దానికోసం జాబితాలు ముందు సరిచూడాలి గాని ఇళ్ల మీద పడి తీసేస్తే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ఏకంగా ఇరవయ్యేళ్ల ఆధారాలను చూపమంటే ఎలా? దీన్ని పౌరసత్వంతో ముడిపెట్టడం ఇంకా దారుణంగా తయారైంది, మేము భారత పౌరులం కాదా. ఈ నిరూపణలేమిటి? అని ఆక్రోశిస్తున్నారు సామాన్యుల నుంచి సెలబ్రటీల వరకూ.

లేడీ బంగారం...

సంకల్పం, సాహసం వుండాలే గానీ సమర్థులెప్పుడైనా ఎక్కడైనా రాణిస్తూనే వుంటారంటారు పెద్దలు. అయితే మన పురుషాధిక్య సమాజంలో మహిళలకు ఇది మరిన్ని ఎక్కువ సవాలు వుంటుంది. అవకాశాలను మించి అవరోధాలే వెంటాడుతుంటాయి. ఇన్నిటి మధ్యనా నిలదొక్కుకుని ముందుకు పోవడం సత్తా చాటడం పెద్ద పరీక్ష, ఈ విషయంలో హీరోయిన్‌ సమంత కొత్త ఉదాహరణ నెలకొల్పారు. ఆమె నటించిన మా ఇంటి బంగారం అత్యధిక వసూళ్లతో లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలలో రికార్డులు సృష్టించింది. గత అయిదారేళ్ల కాలంలో ఆమె వ్యక్తిగత జీవితాన్ని వరుసగా సవాళ్లు ప్రతికూల ప్రచారాలు, ఆరోగ్య సమస్యలు అన్నీ వెన్నాడాయి కదా. విడాకులు తీసుకున్న తర్వాత సోషల్‌ మీడియాలో ఇష్టానుసారం కథనాలు రాస్తుంటే కోర్టుకు వెళ్లి పోరాడారు. ఆరోగ్యపరంగా చూపును దెబ్బ తీసి నీరసం తెచ్చి పెట్టే సమస్య వచ్చింది. తనకు ఇష్టమైన రాజ్‌ నిడిమోరును ప్రేమించి పెళ్లి చేసుకంటే దానిపైనా బోలెడు ట్రోల్స్‌. స్త్రీల హక్కులను గురించి మాట్లాడితే దాడులు. ఓటిటి లో వచ్చిన ఎపిసోడ్‌ల పైనా విసుర్లు. శాకుంతలం సినిమాలో శృంగారం ఎక్కువగా వుందని వ్యాఖ్యానాలు. వీటన్నిటినీ తట్టుకుంటూ, అనుకున్న దిశలోనే ముందుకు నడించిందామె. రాజ్‌ నిడిమోరు నిర్మాతగా తయారైన 'మా ఇంటి బంగారం' గతంలో విజయవంతమైన బాషా, సమరసింహారెడ్డి, ఇంద్ర వంటి సూపర్‌ హిట్ల నమూనా అయినప్పటికీ సాధారణ గృహిణి అవన్నీ చేయడం పెద్ద సంచలనంగా మారింది. హీరో డామినేటింగ్‌ ఇండిస్టీకి పెద్ద షాకిచ్చింది. గతంలో నాడియా, భానుమతి వంటి వారు తర్వాత విజయలలిత, వాణిశ్రీ ఆ పైన ఇటీవల విజయశాంతి, అనుష్క లాంటి వారు లేడీ ఓరియంటెడ్‌ కథలు చేశారు గానీ సమంత వ్యక్తిగతంగానూ చేసిన ఎదురీత వల్ల పూర్తి లేడీ బంగారం అనిపించుకుంటుంది. పైగా ఆ వెంటనే కాన్పు కోసం మెటర్నటీ లీవ్‌ తీసుకుంటున్నానని ప్రకటించి లేడీ బంప్‌ ఫోటోలు కూడా ఇస్తున్నారట. అంటే ఒక మహిళ సహజసిద్ధమైన పాత్ర అన్నమాట.

-పీపీ

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్