గిట్టుబాటు ధర కోసం కలెక్టరేట్ ను దిగ్బంధించిన పొగాకు రైతులు
రైతాంగ ఉద్యమాన్ని తక్కువ అంచనా వేయొద్దు : సంయుక్త కిసాన్ మోర్చా హెచ్చరిక
ప్రజాశక్తి – ఒంగోలు సిటీ : ‘రైతు ఉద్యమాలను ఏ ప్రభుత్వమూ అణచివేయలేకపోయింది. రైతాంగం తలచుకుంటే ప్రభుత్వాలే దిగివచ్చిన చరిత్ర మన దేశానికి ఉంది. గిట్టుబాటు ధర సాధించే వరకు పొగాకు రైతుల పోరాటం ఆగదు. అవసరమైతే జైళ్లకు వెళతాం కానీ రైతుల హక్కులను వదులుకోం’ అని సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సంఘాల నేతలు చేసిన హెచ్చరికలు, నినాదాలతో శనివారం ఒంగోలు ప్రకాశం భవన్ మార్మోగింది. వర్జీనియా పొగాకు కొనుగోలుకు రూ.1000 కోట్లు కేటాయించాలని, క్వింటాలును రూ.25 వేల చొప్పున కొనుగోలు చేయాలని గత 45 రోజులు రైతులు వివిధ రూపాల్లో పోరాడుతున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా నిరాహార దీక్షలకు దిగారు. అయినా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలెక్టర్ ను ముట్టడించారు. రెండు ప్రధాన గేట్లను దిగ్బంధించి గంటల తరబడి బైఠాయించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 45 రోజులుగా రైతులు ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు, వేలం కేంద్రాల ముట్టడిలు నిర్వహిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఉద్యమ తీవ్రతను గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కిలో పొగాకును రూ.200కు తగ్గకుండా కొనుగోలు చేయాలని ట్రాక్టర్ ర్యాలీకి ముందు బోర్డును ఆదేశించినా రూ.160కు మించి వేలం కేంద్రాల్లో కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోరాటాల ద్వారానే ప్రభుత్వాలు దిగివస్తాయి : వి కృష్ణయ్య
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య మాట్లాడుతూ గత ఐదేళ్లుగా పొగాకు రైతులు రెట్టింపు లాభాలు పొందుతున్నారంటూ ప్రభుత్వం, పొగాకు బోర్డు ప్రజలను మభ్యపెడు తోందన్నారు. మొక్కజొన్న, సెనగ, యాపిల్, అరటి వంటి పంటలకు ఇంటర్వెన్షన్ పథకం అమలు చేస్తున్న ప్రభుత్వం దేశానికి లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యం సమకూర్చే పొగాకు పంటకు మాత్రం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రైతులు ఏకమైతే ప్రభుత్వాలు తలవంచక తప్పదని వివరించారు. గిట్టుబాటు ధర సాధించే వరకు ఉద్యమం మరింత ఉధృతం అవుతుందన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.కె.మాబు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జివి కొండారెడ్డి, సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరు రంగారావు, ఎపి వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్.కె.సైదా, రైతు నాయకులు ఆర్.వెంకట్రావు, రైతు నాయకుడు వడ్డె హనుమారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా పొగాకు బోర్డు పాలకవర్గం మారడం లేదంటే కార్పొరేట్ శక్తుల ప్రభావం ఎంత ఉందో అర్థమవుతోందన్నారు. ఐటిసితో కుమ్మక్కై రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని విమర్శించారు. వెంటనే రూ.1000 కోట్లు కేటాయించి క్వింటాలును రూ.25 వేల చొప్పున కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పొగాకు రైతులను రోడ్డున పడేసిన ప్రభుత్వాలు రాజకీయంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రైతు కూలీ సంఘ జిల్లా కార్యదర్శి ఎస్.లలితకుమారి, ఐఎఫ్‌టియు నాయకులు ఎంఎస్.సాయి, రైతు ప్రతినిధి పమిడి నాగేశ్వరరావు, పౌరహక్కుల సంఘం నాయకులు క్రాంతి, న్యాయవాది గోరంట్ల కోటేశ్వరరావు, రైతు నాయకులు అబ్బూరి వెంకటేశ్వర్లు, ఉద్యోగ, కార్మిక, పెన్షనర్ల సంఘాల నాయకులు మద్దతు ప్రకటించాయి. అనంతరం రైతు నాయకులు జిల్లా కలెక్టర్ పి.రాజాబాబును కలసి పొగాకు రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. దీనికి కలెక్టర్ స్పందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరు రంగారావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు పమిడి వెంకటరావు, రైతు నాయకుడు వడ్డె హనుమారెడ్డి అధ్యక్షత వహించారు. పొగాకును ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తే కఠిన చర్యలు: కలెక్టర్ పొగాకు కొనుగోలు చేయకుండా కంపెనీలు ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తే (నోబిడ్ ) కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పి.రాజాబాబు హెచ్చరించారు. కొనుగోలు తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వద్ద ప్రత్యేకంగా సమావేశం జరిగిన తర్వాత కూడా కంపెనీల ధోరణిలో మార్పురాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి పొగాకు బేలును కొనుగోలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. శనివారం ఆయన ఒంగోలు-1, ఒంగోలు-2 పొగాకు వేలం కేంద్రాలను తనిఖీ చేశారు. పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.విశ్వశ్రీతో కలిసి వేలం జరుగుతున్న తీరును పరిశీలించారు. రైతులతోనూ, కొనుగోలుదారులతోనూ ఈ సందర్భంగా ఆయన చర్చించారు.








కామెంట్‌లు (0)