శుక్రవారం, 03 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

రుషికొండ భవనాలు ప్రైవేటుకే - ప్రభుత్వ కీలక నిర్ణయం

2 గంటల క్రితం

Rushikonda buildings to be handed over to private sector – Key government decision
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 03, 2026, 11:44 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

విశాఖ : రుషికొండ భవనాల విషయంలో ఎపి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. భవనాల నిర్వహణకు ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (EOI) ను ఆహ్వానించింది. లీజ్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (O&M) మోడల్‌లో రుషికొండ ప్రాజెక్టు అభివృద్ధికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎపిటిడిసి ఆధ్వర్యంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి అవకాశం కల్పించింది. రుషికొండ హిల్‌టాప్‌లోని భవనాల నిర్వహణ, మార్కెటింగ్, కమర్షియల్ ఆపరేషన్లు ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రతిపాదన చేసింది. APTDC EOI (ఆసక్తి వ్యక్తీకరణ) కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 10లోగా ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గత ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.450 కోట్ల వ్యయంతో రుషికొండలో ఈ భవనాలు నిర్మించిన విషయం విదితమే.


విశాఖపట్నం రుషికొండలో ఉన్న భవనాలను లీజుకు అప్పగించాలని.. ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ కింద ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్నారు. ఏపీటీడీసీ (ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ఆతిథ్య (Hospitality), పర్యాటక (Tourism) అనుబంధ సంస్థలలో ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. రుషికొండపై మొత్తం 9.8 ఎకరాల్లో గార్డెన్‌లు, రోడ్లు, వాక్ వేలు, పార్కింగ్ వసతులతో సహా ఐదు బ్లాకుల్లో సిద్ధంగా ఉన్న భవనాలను అప్పగిస్తామని ప్రకటనలో తెలిపారు. రుషికొండపై భవనాలు మాత్రమే కాదు 1200 చదరపు మీటర్ల ఖాళీ స్థలం కూడా ఉంది.. అక్కడ 4,800 చదరపు మీటర్లలో జీ+1 భవనాలు నిర్మించుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. జులై 10లోగా ఆతిథ్య (Hospitality), పర్యాటక (Tourism) రంగాలలో ఆసక్తి ఉన్న సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని ఏపీటీడీసీ సూచించింది.


రుషికొండపై ఉన్న భవనాలను తీసుకుని నిర్వహించేందుకు ఇంటర్నేషనల్ హోటల్ గ్రూపులైన తాజ్, లీలా, ఫెమా, అట్మాస్ఫియర్‌ కోర్‌లు గతంలోనే ఆసక్తి కనబరిచాయి. రుషికొండ భవనాలు కూడా ఈ హోటల్స్‌కు సంబంధించిన ప్రతినిధులు పరిశీలించారు. అయితే అక్కడ బస చేయడానికి ఎక్కువ గదులు లేకపోవడంతో.. కొత్తగా అదనంగా గదులు నిర్మించేందుకు ఏపీటీడీసీ ప్రకటన విడుదల చేసింది. పర్యాటకశాఖకు రుషికొండలో మొత్తం 70.63 ఎకరాల స్థలం ఉంటే.. 18.65 ఎకరాలు మాత్రమే వినియోగంలో ఉంది. మరో 47.4 ఎకరాలు ఖాళీగా ఉంది, మరికొంత ఆక్రమణలలో ఉందంటున్నారు.


గత ప్రభుత్వ హయాంలో మూడు రాజధానులలో భాగంగా విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా ఎంచుకున్నారు. అందుకే ముఖ్యమంత్రి నివాసం కోసం రుషికొండపై రూ.452 కోట్లతో ఈ భవనాలు నిర్మించారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రుషికొండ భవనాలను ఏం చేయాలనే అంశంపై చర్చించారు. ఈ భవనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్‌లు పరిశీలించారు. అనంతరం ఈ భవనాలను ఎలా ఉపయోగించాలో తేల్చేందుకు మంత్రుల కమిటీని నియమించారు. మంత్రుల కమిటీ ఈ భవనాలను పరిశీలించి చర్చించారు.. చివరకు ప్రైవేట్‌కు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్