న్యూఢిల్లీ : దేశ తయారీరంగ కార్యకలాపాల వృద్ధి జూన్‌లో మందగించింది. హెచ్‌ఎస్‌బీసీ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) జూన్‌లో 54.2కు తగ్గి, గత నాలుగేళ్లలో రెండో అత్యల్ప స్థాయికి చేరింది. కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి, అంతర్జాతీయ అమ్మకాల వృద్ధి మందగించడం ఇందుకు ప్రధాన కారణాలని ప్రైవేట్ సంస్థ సర్వే వెల్లడించింది. గత నాలుగేళ్లలో పీఎంఐ అంతకంటే తక్కువగా నమోదైన సందర్భం పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన తర్వాతి నెల అయిన మార్చి కావడం గమనార్హం. నివేదిక ప్రకారం, కొత్త ఆర్డర్లు ఆశించిన స్థాయిలో పెరగకపోవడంతో కొనుగోళ్లు, ఉత్పత్తి, ఉపాధి వృద్ధి కూడా నెమ్మదించింది. మార్చిని మినహాయిస్తే, ఉత్పత్తి, కొత్త ఆర్డర్ల వృద్ధి గత నాలుగేళ్లలోనే అత్యంత బలహీనంగా నమోదైంది. కొన్ని సంస్థలు మార్కెట్‌లో డిమాండ్ పెరిగిందని తెలిపినా, మరికొన్ని సంస్థలు వినియోగదారుల ఆసక్తి తగ్గిందని, పోటీ తీవ్రంగా మారిందని పేర్కొన్నాయి. దీంతో తయారీరంగ వృద్ధిపై ప్రభావం పడినట్లు నివేదిక వెల్లడించింది.
పశ్చిమాసియా యుద్ధం కారణంగా గతంలో పెరిగిన డిమాండ్ ఇప్పుడు కొంత తగ్గిందని హెచ్‌ఎస్‌బీసీ భారత ప్రధాన ఆర్థికవేత్త ప్రాంజల్ భండారీ వెల్లడించారు. ముఖ్యంగా మూలధన వస్తువుల తయారీ రంగంలో మందగమనం ఎక్కువగా కనిపించిందని, వినియోగ, మధ్యంతర వస్తువుల రంగాల్లోనూ వృద్ధి వేగం తగ్గిందని తెలిపారు. జూన్‌లో భారతీయ వస్తువులకు విదేశీ మార్కెట్ల నుంచి డిమాండ్ కొనసాగినా, కొన్ని యూరోపియన్ దేశాలకు ఎగుమతుల వృద్ధి మందగించింది. దీంతో అంతర్జాతీయ అమ్మకాల వృద్ధి గత 39 నెలల్లోనే అత్యల్ప స్థాయికి చేరినట్లు నివేదిక పేర్కొంది. డిమాండ్, మార్కెట్ పరిస్థితులపై ఉన్న ఆందోళనల కారణంగా వ్యాపార సంస్థల భవిష్యత్ అంచనాలు కూడా బలహీనపడ్డాయి. రాబోయే ఏడాదిలో ఉత్పత్తి పెరుగుతుందని భావిస్తున్న సంస్థల సంఖ్య మేతో పోలిస్తే సగానికి తగ్గింది. అధికశాతం తయారీ సంస్థలు తటస్థ అంచనాలనే వెల్లడించాయి. దీంతో మొత్తం ఆశావాదం ఐదు నెలల కనిష్ట స్థాయికి పడిపోయినట్లు నివేదిక తెలిపింది.








కామెంట్‌లు (0)