ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజాదర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) పాల్గొని ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని సంబంధిత శాఖ అధికారులకు అందజేసి వాటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు పారదర్శకంగా, సమర్థవంతంగా అందేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజాదర్బార్‌లో స్వీకరించిన ప్రతి వినతిని సంబంధిత శాఖలకు పంపించి, వాటి పరిష్కార ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు. సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సూపరింటెండింగ్ ఇంజనీర్ పీ. వెంకట్రావు, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మచ్చరాజు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం : ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 29, 2026, 04:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)