జేఎన్‌టీయూ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
ప్రజాశక్తి...విజయనగరం టౌన్ : ఆదివారం నిర్వహించనున్న రీ-నీట్ పరీక్షల నేపథ్యంలో విజయనగరంలోని జేఎన్‌టీయూ పరీక్ష కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎ.ఆర్. దామోదర్ శనివారం పరిశీలించారు.పరీక్ష కేంద్రంలో అభ్యర్థుల కోసం కేటాయించిన ఎనిమిది పరీక్షా గదులను పరిశీలించిన అధికారులు, బెంచీలపై రోల్ నంబర్ల ప్రదర్శన, ప్రతి గదిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, విద్యుత్ సరఫరా, తాగునీరు, మరుగుదొడ్లు, జనరేటర్ బ్యాకప్ తదితర మౌలిక సదుపాయాలను తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ, రీ-నీట్ పరీక్షను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రంలో భద్రతా చర్యలను మరింత పటిష్టం చేశామని, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని, ప్రవేశ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షకు హాజరు కావాలని ఆకాంక్షించారు.జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎ.ఆర్. దామోదర్ మాట్లాడుతూ, పరీక్షా కేంద్రం వద్ద తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు భంగం కలగకుండా అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.ఈ పరిశీలనలో జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్, జేఎన్‌టీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వి. సుబ్బారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సి.బి. రావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)