టోక్యో : వందకు పైగా విమానాలను రద్దు చేసినట్లు జపాన్ విమానయాన సంస్థలు శుక్రవారం ప్రకటించాయి. ఒకినావా, కగోషిమా దక్షిణ ప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు 120 విమానాలను రద్దు చేసినట్లు జపాన్ ఎయిర్‌లైన్స్ , ఆల్ నిప్పన్ ఎయిర్‌వేస్ ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. రెండు హరికేన్‌లు జపాన్‌పై విరుచుకుపడే అవకాశం ఉందని, దీంతో వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అన్నారు. నదులలో నీటి మట్టాలు పెరుగుతున్నాయని, వరదల ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని క్యోటో, ఒసాకాలోని అధికారులు హెచ్చరించారు. హరికేన్ మెఖాలా టైపూన్ స్థాయి నుండి బలహీనపడినప్పటికీ, గంటకు 144 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు. దక్షిణ, పశ్చిమ జపాన్‌లలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. హరికేన్ క్యుషు, షికోకు దీవుల సమీపంగా ప్రయాణించి, పసిఫిక్ మహాసముద్రంలోని హిగోస్ అనే మరో హరికేన్‌తో కలిసే అవకాశం ఉందని తెలిపారు. వరదలకు రహదారులను మూసివేశామని, టయోటా క్యూషూలోని ఒక ప్లాంట్‌లో, నిస్సాన్‌లో కార్యకలాపాలను నిలిపివేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. అమెరికాతో సంయుక్త విన్యాసాలలో భాగంగా మియాకో ద్వీపానికి తీసుకెళ్లాల్సిన వి-22 ఆస్ప్రే రవాణా విమానం యొక్క తొలి ప్రయాణాన్ని జపాన్ సైన్యం కూడా రద్దు చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది.
తైవాన్‌లోనూ భారీ వర్షాలు
మెఖాలా హరికేన్‌తో తైవాన్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలతో వరదలు ముంచెత్తాయి. కొండచరియలు విరగిపడే ప్రమాదం ఉన్నందున సుమారు 1600మందికి పైగా ప్రజలను నివాసాల నుండి తరలించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.









కామెంట్‌లు (0)