mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అక్రమ రవాణా నెట్ వర్క్ లు సమాజాలకు ముప్పు : యుఎస్ కాన్సుల్ జనరల్

20 జూన్, 2026

US Envoy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 20, 2026, 01:29 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం


రాంచీ : అక్రమ రవాణా నెట్‌వర్క్‌లు సమాజాలకు, జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తున్నాయని కోల్‌కతాలోని యుఎస్ కాన్సుల్ జనరల్ క్యాథీ గైల్స్-డియాజ్ పేర్కొన్నారు. ఇటువంటి అంతర్జాతీయ నేర కార్యకలాపాలను వాటి మూలాల వద్దనే నిర్మూలించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.


కోల్‌కతాలోని యూఎస్ కాన్సులేట్ జనరల్ గురువారం రాంచీలో 'ఎన్‌ఫోర్స్‌మెంట్ కోఆపరేషన్ కాన్‌క్లేవ్'ను నిర్వహించింది. ప్రభుత్వ సంస్థలు, చట్ట అమలు సంస్థలు, పౌర సమాజ సంస్థలు, ఎన్ జి ఒలు, విద్యావేత్తల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో 'అక్రమ రవాణా ముప్పులను ఎదుర్కోవడానికి యుఎస్ -ఇండియా సహకారం' సదస్సులో ఆమె మాట్లాడారు. ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం, సమాచార మార్పిడి యంత్రాంగాలను మెరుగుపరచడం, అక్రమ రవాణా నెట్‌వర్క్‌లను గుర్తించడం, నిరోధించడం, అడ్డుకోవడం కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వంటి మార్గాలపై వారు చర్చించారు. అక్రమ రవాణా నెట్‌వర్క్‌లు సమాజాలకు హాని కలిగిస్తాయని, జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తాయని,బలహీన వర్గాలను దోపిడీ చేస్తాయని గైల్స్-డియాజ్ అన్నారు. కేవలం ప్రసంగించడానికి కాదని, చర్యలు తీసుకోవాలని అన్నారు. అయితే ఒంటరిగా ఈ చర్యలను చేపట్టలేమని, భారత్ కు సహకారంగా వ్యవహరిస్తామని ఆమె అన్నారు.


ఈ సమావేశం సందర్భంగా అమెరికన్, భారతీయ నిపుణులు అధునాతన దర్యాప్తు నమూనాలు, డేటా ఆధారిత సరిహద్దు నిఘా సాధనాలు, బహుళ-సంస్థల సమన్వయ చట్రాలకు సంబంధించిన వివరాలను అందించారు. అమెరికా సరిహద్దులకు, సమాజాలకు ముప్పుగా పరిణమించిన అక్రమ రవాణా నెట్‌వర్క్‌లపై ట్రంప్ ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఇందులో భాగంగా 100 మందికి పైగా ఆన్‌లైన్ మోసగాళ్లపై ఆంక్షలు విధించిందని యుఎస్ కాన్సులేట్ తెలిపింది. వీరిలో చాలామంది ప్రపంచవ్యాప్తంగా బాధితులను మోసం చేయడానికి బలవంతపు శ్రమను ఉపయోగించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడానికి, నేరపూరిత లాభాలను నిరోధించడానికి చేపట్టిన ప్రయత్నాల్లో భాగంగా అమెరికా చట్ట అమలు సంస్థలు దాదాపు 20 లక్షల కిలోల అక్రమ మత్తుపదార్థాలు, మాత్రలను స్వాధీనం చేసుకున్నాయని కూడా ఆ నివేదిక పేర్కొంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్