బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

వైద్యానికి సరిహద్దులు లేవని చాటిచెబుతోంది!

15 గంటల క్రితం

23-1782819682120-7630.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 06:00 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

యుద్ధాలు, అంతర్యుద్ధాలతో అట్టుడికిపోతున్న ప్రజలకు వైద్య సాయం చేయడం ఆషామాషీ కాదు. అంటువ్యాధులు ప్రబలి, కనీస మౌలిక వసతులు లేని శరణార్థ శిబిరాల్లో నెలల తరబడి వైద్యం చేయడం కూడా అంత సులువు కాదు. కానీ విజయవాడకు చెందిన డాక్టర్ షైనీ దశాబ్దం పైగా దక్షిణ సూడాన్, యెమెన్, ఇథియోపియా, నైజీరియా, సోమాలియా, ఉక్రెయిన్ వంటి దేశాల్లో 'డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్' తరపున 2013 నుండి 2024 వరకు వైద్య సేవలు అందించారు. అంతకంటే ముందు ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ లెప్రసీ హాస్పిటల్‌లో విధులు నిర్వర్తించారు. తన నిస్వార్థ సేవతో ఎందరో రోగులకు వైద్యం అందించిన షైనీ ప్రయాణం ఇప్పుడు మరింతగా విస్తరించబోతోంది. ప్రపంచంలోనే ప్రముఖ యూనివర్సిటీల్లో ఒకటైన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో 'గ్లోబల్ హెల్త్ లీడర్‌షిప్' కోర్సు అభ్యసించేందుకు ఈ ఏడాది సెప్టెంబరులో ఆమె లండన్‌కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వైద్యురాలిగా తన ప్రయాణంలో ఎదురైన ఎన్నో సంగతులను ఆమె గుర్తుచేసుకున్నారు.


షైనీ విజయవాడలో పుట్టి పెరిగారు. సుదర్శన్, జలజ ఆమె తల్లిదండ్రులు. పటమట ఎన్‌ఎస్‌ఎం స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. వెల్లూరు సీఎంసీ కళాశాలలో 2009లో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. శిక్షణా కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేయడంలో భాగంగా యువత ఎక్కువగా ఎంచుకోని ఆస్పత్రికి వెళ్లి ఆమె వైద్య సేవలు చేశారు. అలహాబాద్ కుష్ఠురోగ ఆస్పత్రిలో ఆమె చేసిన వైద్యం ఎందరో రోగులకు వ్యాధి నుంచి ఉపశమనం కలిగించింది. జనరల్ ఫిజీషియన్‌గా తనకున్న అనుభవాన్ని మరింతమంది రోగులకు అందించేలా దేశంలోనో, రాష్ట్రంలోనో ఏదేని ఆస్పత్రిలో వైద్యవృత్తిలో షైనీ స్థిరపడవచ్చు. కానీ 'డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్' తరపున సరిహద్దుల ఆవల రోగులకు సేవ చేస్తున్న డాక్టర్ల గురించి తెలుసుకుని ఆమె ఎంతో ప్రభావితమయ్యారు. తాను కూడా ఆ మార్గంలో నడిచి మరింతమందికి సేవ చేయాలని అనుకున్నారు.

'డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్' (ఎంఎస్‌ఎఫ్) అనేది ఒక స్వతంత్ర అంతర్జాతీయ మానవతావాద సంస్థ. ఈ సంస్థ 60కి పైగా దేశాల్లో సాయుధ సంఘర్షణలు, అంటువ్యాధులు, ప్రకృతి వైపరీత్యాలు, మానవ కల్పిత విపత్తులు లేదా ఆరోగ్య సంరక్షణ సేవలకు దూరమైన ప్రజలకు అత్యవసర వైద్య సహాయాన్ని అందిస్తుంది. ఈ సంస్థ 25 వేల మందికి పైగా స్థానిక సిబ్బందితో కలిసి పనిచేయడానికి 3 వేల మందికి పైగా వైద్యులు, నర్సులు, లాజిస్టిక్స్ నిపుణులు, నీరు, పారిశుధ్య నిపుణులు, నిర్వాహకులు, ఇతర వృత్తి నిపుణులతో కలిసి వివిధ దేశాల్లో సేవలు అందిస్తోంది.

డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్‌తో ప్రయాణం...

2013 నుండి షైనీ ఈ సంస్థ తరపున వైద్య సేవలు చేశారు. మొట్టమొదటి ప్రాజెక్టు ఇథియోపియా–సోమాలియా సరిహద్దు ప్రాంతంలో నిర్వహించారు. అది అంతర్యుద్ధ ప్రాంతం. 2015లో యెమెన్‌లో కలరా తీవ్రంగా ప్రబలినప్పుడు అక్కడ విధులు నిర్వర్తించారు. ఆ తరువాత నైజీరియాలో పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు, సబ్ సహారా ఆఫ్రికాలో ఎడారి మధ్యలో ఓ గుడారంలో షెల్టర్ తీసుకుని వైద్య సేవలు అందించడం... ఇలా చాలా అనుభవాలు షైనీ ప్రయాణంలో ఉన్నాయి. "జీవితంలో ఒక్కసారి కూడా వైద్యుడిని చూడని అరుదైన ప్రాంతానికి వెళ్లి సేవలు చేశాను" అని షైనీ చెప్పారు. బాంబు దాడులు జరుగుతున్నప్పుడు బంకర్లలోకి వెళ్లి ప్రజలు తలదాచుకోవడం, గట్టిగా ఏ శబ్దం వినిపించినా భయంతో వణికిపోయే జనాలకు ఆమె వైద్యంతో పాటు మనోనిబ్బరం కూడా కల్పించేవారు. తనకు ఎదురైన అనుభవాలను ఆమె ఇలా చెప్పారు.

12-1782819682120-2824.jpg

"ఒకసారి 70 ఏళ్లు పైబడిన ఓ మహిళ హెల్త్ సెంటర్‌కు వచ్చింది. తను నడుం నొప్పితో బాధపడుతోంది. కారణం ఏంటని నేను ట్రాన్స్‌లేటర్ సాయంతో అడిగాను. 50 ఏళ్ల తన కొడుకు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని, తనను చూసుకోవడానికి ఎవరూ లేరని చెప్పింది. మిలిటెంట్లు దాడులు చేసినప్పుడు బంకర్‌లోకి వెళ్లి తలదాచుకోవడానికి నడవలేని స్థితిలో ఉన్న కొడుకుని వీపుపై వేసుకుని కిందకు వెళ్లడం చాలా కష్టంగా ఉందని, ఆ సమయంలో నడుం తీవ్రంగా నొప్పి పుడుతుందని ఆమె చెబుతున్నప్పుడు నాకు కళ్ల నుంచి ధారాళంగా నీళ్లు వచ్చాయి. ఆ ముసలావిడకు పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం తప్ప నేను ఏమీ చేయలేకపోయాను. దాడులు అమాయకులను ఎంతలా ప్రభావితం చేస్తాయో అనడానికి ఈ ఘటనే ఉదాహరణ" అని షైనీ తనకెదురైన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.

పోషకాహార లోపం ఉంటే సరైన ఆహారం తీసుకుంటే సరిపోతుందని అనుకుంటాం. కానీ తనకెదురైన ఓ అనుభవాన్ని షైనీ ఇలా చెప్పారు. "నేను వెళ్లిన దేశాల్లో చాలా చోట్ల పోషకాహార లోపంతో పిల్లలు చనిపోయేవాళ్లు. దానికి ప్రత్యేక వైద్యం ఉందని నాకు అక్కడికి వెళ్లాకే తెలిసింది. మందులు, పాలు, ఆహారం అన్నీ ప్రత్యేకంగానే ఇచ్చేవాళ్లం. మలేరియా కూడా చాలా ప్రాంతాల్లో ప్రజల ప్రాణాలను తీస్తుంది. కోవిడ్ టైంలో దక్షిణ ఆఫ్రికాలో ఓ మారుమూల ప్రాంతంలో సేవలు అందించాను. అప్పుడు స్థానిక ఆస్పత్రులకు వెళ్లి డాక్టర్లకు, నర్సులకు వైరస్ పట్ల అవగాహన కల్పించేదాన్ని. నేను ప్రత్యక్షంగా వెళ్లలేని చోటుకు ఆ డాక్టర్ల ద్వారా వైద్యం అందుతుందని సంతోషపడేదాన్ని" అని ఆ రోజులను ఆమె గుర్తు చేసుకున్నారు.

యుద్ధాల్లో మహిళలు, పిల్లలు ఎంతలా బలవుతున్నారో అనడానికి షైనీ చెప్పిన ఈ ఘటన అద్దం పడుతుంది. "విధుల్లో ఉన్నప్పుడు అర్ధరాత్రుళ్లు కూడా నాకు ఫోన్లు వచ్చేవి. ఎప్పుడైనా మెటర్నిటీ వార్డుకు రావాలి అని ఫోన్ వస్తే... 'రేప్ కేసా, డెలివరీ కేసా?' అని అడిగేదాన్ని. అక్కడ అలాంటివి సర్వసాధారణం. శత్రువు దేశంపై యుద్ధం చేయడం అంటే బాంబు దాడులు మాత్రమే కాదు. శత్రు దేశాల మహిళల శరీరాలను విచ్ఛిన్నం చేయడం కూడా! వయసుతో సంబంధం లేకుండా ఎంతోమందిని నేను ఆ స్థితిలో చూశాను. ఒకసారి ఒక డెలివరీ కేసును స్టడీ చేయడానికి వెళ్లినప్పుడు అప్పటికే ప్రసవం అయిపోయింది. బిడ్డ 15 అంగుళాల కంటే ఎక్కువ పొడుగు లేదు. ఆ బిడ్డ బతికే అవకాశం కూడా లేదు. బిడ్డ తల్లిని చూద్దామని పక్క వార్డుకు వెళ్లాను. అక్కడ మంచంపై ఓ 10, 11 ఏళ్ల చిన్నపిల్ల పడుకుని ఉంది. తనకు కళ్లు లేవు. ఆ పాపే బిడ్డ తల్లి అని చెప్పారు. ఆ క్షణం నాకు దుఃఖం తన్నుకొచ్చింది. అభం శుభం తెలియని వైకల్యం ఉన్న ఆ పిల్ల, పుట్టిన బిడ్డ బతకడని తెలిసి కూడా తన చేతులతో శిశువును ప్రేమగా తాకింది. ఆ దృశ్యం ఎప్పుడు గుర్తుకొచ్చినా నాకు కన్నీళ్లు ఆగవు" అని చెబుతున్న షైనీ లాంటి డాక్టర్లు మనకు చాలా అరుదుగా కనిపిస్తారు.

షైనీ తన సేవలను నిస్వార్థ సేవలు అంటే ఆమె ఒప్పుకోరు. "విజయవాడలో పుట్టిన నేను ప్రపంచ దేశాలు చుట్టి వచ్చాను. ఇప్పుడు లండన్‌కు వెళ్తున్నాను. దేశవిదేశాల్లో ఆరోగ్య మంత్రులతో ఎప్పుడైనా మాట్లాడగలను. వైద్యవిద్య చేసిన చాలామందికి ఈ అవకాశాలు రావు. ఇవే నన్ను ఈ మార్గంలో మరింత ముందుకు నడిపిస్తున్నాయి. ఆ ప్రయాణంలోనే వైద్య సేవలు అందిస్తున్నా... అంతే..." అంటారు చాలా నిగర్వంగా.

వైద్యవృత్తిని వృత్తిగా చేసే ఎంతోమంది వైద్యుల మధ్య షైనీ లాంటి వైద్యులు చాలా తక్కువమంది కనిపిస్తారు. ఇలాంటి వైద్యులు ఎంత సేవ చేసినా ఇంకా తాము చేయాల్సింది ఎంతో ఉందంటూ విస్తృత సేవా మార్గంలో ప్రయాణిస్తారు. ఇప్పుడు షైనీ చేస్తున్న ప్రయాణం కూడా అదే. "ఆక్స్‌ఫర్డ్‌లో అభ్యాసం తరువాత యూఎన్‌లో ఉన్నత స్థానం సాధించాలి. అప్పుడే ఎటువంటి నిర్బంధాలు లేకుండా వైద్య సేవలను మరింత మందికి అందించవచ్చు. పాలసీలు తీసుకురావచ్చు. ఆ లక్ష్యం కోసం ఎంత దూరమైనా ప్రయాణిస్తా" అంటున్న షైనీ ఆశ నెరవేరాలని మనమూ కోరుకుందాం.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్