న్యూఢిల్లీ : దేశంలో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వసూళ్లు జూన్ నెలలో భారీ వృద్ధిని నమోదు చేశాయి. బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన నెలలో మొత్తం జిఎస్‌టి వసూళ్లు రూ.1.95 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 14 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. ఈ వసూళ్లలో దేశీయ లావాదేవీల ద్వారా రూ.1.35 లక్షల కోట్లు సమకూరగా, దిగుమతులపై వచ్చిన పన్ను వసూళ్లు ఏకంగా 34.6 శాతం పెరిగి రూ.60 వేల కోట్లకు చేరుకున్నాయి. జూన్ నెలకు సంబంధించి రూ.32,436 కోట్ల రిఫండ్‌లను సర్దుబాటు చేసిన తర్వాత.. నికర జిఎస్‌టి వసూళ్లు రూ.1.62 లక్షల కోట్లుగా ఉన్నాయి.
ఎపిలో 5 శాతం వృద్ధి..
జూన్ నెలలో తెలుగు రాష్ర్టాలు సానుకూల వృద్ధిని సాధించాయి. తెలంగాణకు స్థూలంగా రూ.5,050 కోట్ల జిఎస్టి వసూళ్లు రాగా.. గత ఏడాదితో పోలిస్తే 11 శాతం వృద్ధిని నమోదు చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌కు రూ.3,548 కోట్ల స్థూల వసూళ్లు రాగా.. ఐదు శాతం పెరుగుదల నమోదయ్యింది. పన్ను వాటాల సర్దుబాటు అనంతరం.. తెలంగాణ నికర జిఎస్‌టి ఆదాయం రూ.3,994 కోట్లుగా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ నికర ఆదాయం రూ.3,144 కోట్లుగా ఉన్నట్లు ఆర్థిక శాఖ గణాంకాలు వెల్లడించాయి.








కామెంట్‌లు (0)