పూర్ణపాడు-లాబేసు వంతెన పూర్తికి పోరుబాట : పుణ్యవతి
ప్రజాశక్తి-కొమరాడ(పార్వతీపురం మన్యం జిల్లా) : ఏజెన్సీలో రెండు దశాబ్దాలుగా గిరిజనులు ఎదుర్కొంటున్న పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణం పూర్తి అయ్యేంత వరకూ నాగావళి నది సాక్షిగా పోరాటం చేస్తామని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. పుణ్యవతి అన్నారు. పూర్ణపాడు-లాబేసు వంతెన పెండింగ్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సాధన కమిటీ ఆధ్వర్యాన లాబేసు నుంచి చేపట్టిన పాదయ్రాతను ఆమె గురువారం ప్రారంభించారు. తొలిరోజు కొరిశీల, పొడుగువలస, శిఖవరం, గాజులుగూడ, దిగువ గుణద, సవర గుణద మీదుగా బిన్నిడి గ్రామానికి యాత్ర చేరుకుంది. మూడు రోజులు పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులకు, వంతెన సాధన కమిటీ సభ్యులకు బాధిత గ్రామాల ప్రజలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పుణ్యవతి మాట్లాడుతూ... గిరిజన ప్రాంతంలో ప్రభుత్వం, స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. 1995లో పడవ మునిగి 36 మంది గిరిజనులు మరణించినప్పటికీ పాలకులు చలించలేదని విమర్శించారు. 2006లో సిపిఎం శాసనసభ్యులు కోలక లక్ష్మణమూర్తి అసెంబ్లీలో ప్రస్తావించి, పట్టుబడితే 2007 లో పూర్ణపాడు-లాబేసు గ్రామాల మధ్య వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు వెచ్చించి 70 శాతం పనులు పూర్తి చేశారని, మిగిలిన 30 శాతం పనులు పూర్తి చేయడానికి 15 ఏళ్లు గడుస్తున్నప్పటికీ నేటికీ పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే గిరిజనులకు పాలకులు ఇస్తున్నటువంటి గౌరవమని విమర్శించారు. పూర్ణపాడు- లాబేసు వంతెన పనులు పూర్తి చేయాల్సిందేనని, లేకపోతే ఈ పాలకులకు ప్రజలు గట్టి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. దేశంలో ఈ 20 ఏళ్ల కాలంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్, పెట్టుబడిదారుల కోసం రోడ్లు, వంతెనలు నిర్మించారని, రూ పది కోట్ల రూపాయల ఖర్చు చేస్తే 60 గ్రామాల ప్రజలకు ఉపయోగపడే ఈ వంతెన నిర్మాణం పూర్తవుతుందన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు మాట్లాడుతూ... కురుపాం నియోజకవర్గ ప్రజలకు అందులోనూ కొమరాడ మండల ప్రజలకు ఎంతో ప్రయోజనకరమైన పూర్ణపాడు-లాబేసు వంతెన పూర్తి చేస్తామని గత ఎన్నికలలో హామీ ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఈ రెండేళ్ల కాలంలో ఈ వంతెన నిర్మాణానికి చేసిన ప్రయత్నం ఏమిటని ప్రశ్నించారు? ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కొల్లి సాంబమూర్తి, గిరిజన జెఎసి నాయకులు మల్లయ్య, గంగాధర్, ప్రజా సంఘాల నాయకులు వి ఇందిర, బి. లక్ష్మి, ఎన్ వై నాయుడు, విద్యార్థి నాయకులు సింహాచలం, అనిల్, కృష్ణ, దాసరి వెంకట్ నాయుడు తదితరులు పాల్గొన్నారు








కామెంట్‌లు (0)