గురువారం, 02 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionFIFA World Cup: బెల్జియం చారిత్రాత్మక విజయం

1 గంట క్రితం

belgium
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 02, 2026, 11:05 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

  • బోస్నియాపై గెలుపుతో ప్రీ క్వార్టర్స్‌కు అమెరికా

  • ఫిఫా ప్రపంచకప్‌ 2026

సియాటెల్‌: సియాటెల్‌ ‌స్టేడియంలో గురువారం జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో బెల్జియం 3-2తో సెనెగల్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. 86వ నిమిషం వరకు బెల్జియం జట్టు 0-2గోల్స్‌‌తో వెనుకబడ్డా.. ఆ తర్వాత కేవలం 4 నిమిషాల వ్యవధిలో 2గోల్స్‌ ‌కొట్టి స్కోర్‌‌ను సమం చేసింది. అదనపు సమయంలో మరో గోల్‌ ‌కొట్టి 3-2తో సెనెగల్‌పై గెలుపొందడం విశేషం. 86వ నిమిషం వరకు సెనెగల్ జట్టు మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అయితే సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన రొమేలు లుకాకు 86వ నిమిషంలో క్లోజ్-రేంజ్ గోల్‌తో బెల్జియం ఖాతా తెరిచాడు. దాంతో బెల్జియం శిబిరంలో ఆశలు చిగురించాయి. సరిగ్గా మూడు నిమిషాల తర్వాత (89వ నిమిషంలో) సెనెగల్ గోల్‌కీపర్ మోరీ దియావ్ చేసిన పొరపాటును అనుకూలంగా మార్చుకుంటూ యూరి టీల్‌మన్స్ హెడర్ ద్వారా గోల్ చేసి స్కోరును 2-2తో సమం చేశాడు. మ్యాచ్ ఆరంభం నుంచి సెనెగల్ తమ దూకుడుతో బెల్జియం డిఫెన్స్‌ను ముప్పు తిప్పలు పెట్టింది. ఆట 25వ నిమిషంలో హబీబ్ దియారా గోల్ చేసి సెనెగల్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. రెండో అర్ధభాగం ప్రారంభమైన ఆరు నిమిషాలకే (51వ నిమిషంలో) ఇస్మాయిలా సార్ మరో అద్భుతమైన గోల్‌తో స్కోరును 2-0కు పెంచాడు. ఈ ప్రపంచకప్‌లో సార్‌కు ఇది నాలుగో గోల్. బెల్జియం స్టార్ ఆటగాళ్లు కెవిన్ డి బ్రూయిన్, జెరెమీ డోకులను కోచ్ బయటకు రప్పించడంతో ఆ జట్టు ఓటమి ఖాయమని అందరూ భావించారు.

అదనపు సమయంలో టీల్‌మన్స్ రికార్డు గోల్

నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరు జట్లు సమంగా ఉండటంతో మ్యాచ్ అదనపు సమయానికి దారితీసింది. అదనపు సమయానికి చివరి నిమిషంలో (125వ నిమిషంలో) బెల్జియం కెప్టెన్ టీల్‌మన్స్‌ను సెనెగల్ డిఫెండర్ లామిన్ కమారా ఫౌల్ చేయడంతో, ‌విఎఆర్‌ సమీక్ష అనంతరం రెఫరీ పెనాల్టీ ప్రకటించారు. ఒత్తిడిని అధిగమిస్తూ టీల్‌మన్స్ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపి బెల్జియంకు 3-2తో అద్భుత విజయాన్ని అందించాడు. ప్రపంచకప్ నాకౌట్ చరిత్రలో రెండు గోల్స్ వెనుకబడి మ్యాచ్ గెలవడం బెల్జియంకు ఇది రెండోసారి. గతంలో 2018లో జపాన్‌పైనా బెల్జియం ఇదే విధంగా గెలిచింది. ప్రి క్వార్టర్స్‌‌లో బెల్జియంజట్టు అమెరికాతో తలపడనుంది.

అమెరికా అలవోకగా..

శాంటాకార్లా వేదికగా జరిగిన రౌండ్‌-32 మ్యాచ్‌లో ప్రపంచకప్‌ 2026లో ఆతిథ్య అమెరికా జట్టు 2-0తో బోస్నియాను చిత్తు చేసింది. ప్రీ క్వార్టర్‌ ఫైనల్స్‌కు (రౌండ్‌ ఆఫ్‌ 16) చేరింది. బుధవారం జరిగిన రౌండ్‌-32 మ్యాచ్‌లో అమెరికా జట్టు 2-0 గోల్స్‌ తేడాతో బోస్నియా అండ్‌ హెర్జెగొవినాపై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అమెరికా చివరి 25 నిమిషాల ఆటను కేవలం 10 మంది ఆటగాళ్లతో ఆడి గెలవడం విశేషం. 64వ నిమిషంలో స్టార్‌ ఫార్వర్డ్‌ ఫొలారిన్‌ బలోగన్‌ రెడ్‌ కార్డ్‌కు గురై మైదానాన్ని వీడాడు. రెడ్‌ కార్డ్‌కు గురయ్యే సమయానికి బలోగన్‌ చెలరేగి ఆడుతున్నాడు. 45వ నిమిషంలో గోల్ చేసి అమెరికాకు ఆధిక్యం అందించాడు. ఈ టోర్నీలో అతనికి ఇది మూడో గోల్. మరోవైపు బోస్నియా కూడా ప్రారంభంలో కొన్ని అవకాశాలు సృష్టించుకున్నా అమెరికా గోల్‌కీపర్ మ్యాట్‌ ఫ్రీస్‌ అద్భుతమైన సేవ్‌లతో జట్టును కాపాడాడు. బలోగన్‌ రెడ్‌ కార్డ్‌కు గురైనా వెనక్కి తగ్గని అమెరికా 82వ నిమిషంలో మరో గోల్‌ చేసి ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. మలిక్‌ టిల్‌మ్యాన్‌ అద్భుతమైన ఫ్రీకిక్‌తో గోల్ చేసి అమెరికా విజయాన్ని ఖాయం చేశాడు. కాగా, ప్రపంచకప్‌ చరిత్రలో అమెరికా రౌండ్‌ ఆఫ్‌ 16కు చేరడం ఇది మూడోసారి. 1930లో తొలిసారి సెమీస్‌కు చేరిన ఆ జట్టు.. 2002లో ప్రి క్వార్టర్స్‌‌కు చేరింది. జూలై 6న సియాటిల్‌లో అమెరికా ప్రి క్వార్టర్స్‌‌లో బెల్జియంతో తలపడనుంది.

మాలిక్ టిల్మాన్ ఫ్రీ కిక్ మ్యాజిక్..

బోస్నియా జట్టు తొలి అర్ధభాగంలో అటాకింగ్ గేమ్‌ ఆడింది. 40 ఏళ్ల లెజెండరీ కెప్టెన్ ఎడిన్ జెకో ఇచ్చిన పాస్ తో ఎర్మెడిన్ డెమిరోవిక్ కొట్టిన షాట్ ను అమెరికా కీపర్ మాట్ ఫ్రీజ్ సూపర్ సేవ్ తో అడ్డుకున్నాడు. రెండో అర్ధభాగంలో జెకో ఇంజరీ వల్ల గ్రౌండ్ వీడటం బోస్నియాను బాగా దెబ్బతీసింది. అమెరికా 10 మందితో ఆడుతున్న టైమ్‌లో బోస్నియాకు గోల్ కొట్టే గోల్డెన్ ఛాన్స్ వచ్చినా డెమిరోవిక్ మళ్లీ కీపర్ చేతుల్లోకే కొట్టాడు. మ్యాచ్ 82వ నిమిషంలో అమెరికాకు ఒక ఫ్రీ కిక్ లభించింది. ఈ గోల్డెన్ ఛాన్స్ ను మాలిక్ టిల్మాన్ ఒక క్లాసిక్ కర్లింగ్ షాట్ తో బోస్నియా కీపర్ నికోలా వాసిల్ ను దాటించి నెట్ లోకి పంపడంతో అమెరికా 2-0తో విజయం సాధించింది.

ఫిఫా ప్రపంచకప్‌‌ రౌండ్‌-32లో నేడు...

3(శుక్ర): స్విట్జర్లాండ్‌ × అల్జీరియా (ఉ.8.30గం.లకు)

ఆస్ర్టేలియా × ఈజిప్ట్‌ (రా.11.30గం.లకు)

4(శని): అర్జెంటీనా × కాబో వెర్డే (తె.3.30గం.లకు)

కొలంబియా - ఘనా (ఉ.7.00గం.లకు)

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్