పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సిఎండికి మంత్రి బిసి జనార్దన్ రెడ్డి వినతి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నంద్యాల జిల్లా బనగానపల్లె ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్) కింద నిధులు మంజూరు చేయాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిఎండి వంశీ రామమోహన్‌ను రాష్ట్ర పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి కోరారు. గురువారం హర్యానాలోని గురుగ్రామ్‌లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి, సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) బుర్రా వంశీ రామ మోహన్‌తో మంత్రి భేటీ అయ్యారు. బనగానపల్లె నియోజకవర్గ పరిధిలోని కొలిమిగుండ్ల మండలం నందిపాడు గ్రామంలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్స్ ప్రాజెక్టుపై చర్చించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో బనగానపల్లె ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు సిఎస్ఆర్ కింద నిధులు విడుదల చేయాలని కోరారు. ముఖ్యంగా వర్షాకాలంలో జుర్రేరు వాగు వరద ప్రవాహం వల్ల స్థానిక నివాస ప్రాంతాలు, వ్యవసాయ పంట భూములు ముంపునకు గురవుతున్న విషయాన్ని సిఎండి దృష్టికి మంత్రి తీసుకెళ్లారు. జుర్రేరు వాగు సుందరీకరణ, వరద నివారణ కోసం రూ. 4.95 కోట్లతో చేపట్టదలచిన రిటైనింగ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు రూ. 2 కోట్ల విలువైన ఆధునిక వైద్య పరికరాలను సిఎస్ఆర్ నిధుల కింద సమకూర్చాలని కోరారు.
కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడుతోనూ..
ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడిని ఆయన కార్యాలయంలో మంత్రి బిసి జనార్థన్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏవియేషన్ రంగ అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక, రూట్ మ్యాప్, పెండింగ్‌లో ఉన్న అనుమతులు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశంలో ఆర్అండ్‌బి, ఐఅండ్ఐ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి కృష్ణబాబు, మారిటైమ్ బోర్డు సిఈవో ప్రవీణ్ ఆదిత్య, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)