శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ప్రారంభించిన మంత్రి లోకేష్
చదువుతో పాటే ఉద్యోగం: శ్రీనిరాజు
ప్రజాశక్తి -వరదయ్యపాలెం (తిరుపతి జిల్లా) : యువతకు అపారమైన సామర్థ్యం, ఆశయాలు ఉన్నాయని, వారికి అవసరమైనదల్లా ఉపాధి అవకాశాలతో నేరుగా అనుసంధానమైన విద్యావిధానమని మంత్రి లోకేష్ తెలిపారు. ఈ కీలక సవాలుకు పరిష్కారం చూపే ప్రయత్నంలో మన రాష్ర్టం ముందు వరుసలో ఉండటం గర్వకారణమన్నారు. తిరుపతి జిల్లా శ్రీసిటీలోని తాత్కాలిక క్యాంపస్‌లో శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ (ఎస్‌ఐయు)ని గురువారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎస్‌ఐయు అమలు చేస్తున్న వర్క్-స్టడీ డ్యూయల్ మోడల్ కు శ్రీసిటీలోని బలమైన పారిశ్రామిక ఎకోసిస్టమ్ కీలకంగా నిలుస్తోందన్నారు. 31 దేశాలకు చెందిన 250కు పైగా కంపెనీలు వివిధ రంగాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. పరిశ్రమ, విద్యావ్యవస్థలను అనుసంధానించిన కేంద్రాలు దేశంలోనేకాక ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదు అని వ్యాఖ్యానించారు. ఎస్‌ఐయులో విద్యను అభ్యసించే విద్యార్ధులు క్యాంపస్‌కు సమీపంలోనే ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలతో కలిసి నేర్చుకునే, పనిచేసే అవకాశాన్ని కలిగి ఉంటారని తెలిపారు. ఎస్ఐయు పాలకమండలి చైర్మన్ శ్రీనిరాజు మాట్లాడుతూ... నాలుగేళ్ల డిగ్రీ చదివిన విద్యార్థి మొదటి సంవత్సరం నుంచే ఇంటర్న్‌షిప్‌ల ద్వారా ప్రతి నెల రూ. పదివేలు స్టైఫండ్ పొందుతారని తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు, ఉత్పాదకత పెరుగుతున్న కొద్ది స్టైఫండ్ మొత్తాన్ని పెంచే విధంగా పరిశ్రమ భాగస్వాములు భావిస్తున్నారన్నారు. ఈ ఏడాది బిటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, బిటెక్ ఇన్ అడ్వాన్స్ డ్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, డిజిటల్ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ బిబిఎ కోర్సులతో 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభించినట్లు తెలిపారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి అతిథులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐయు గ్లోబల్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు, పాలకమండలి ప్రతినిధులు, పరిశ్రమ భాగస్వాములు పాల్గొన్నారు. శ్రీసిటీ మోడల్, వివిధ పరిశ్రమల ఉత్పత్తుల నమూనాలు, పలువురు ముఖ్య నేతలు, అధికారుల సందర్శనల చిత్ర మాలికలను లోకేష్ పరిశీలించారు. అనంతరం ఎస్ఐయు, శ్రీసిటీ ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు, విద్యార్థులు, కంపెనీల ప్రతినిధులను ఆప్యాయంగా పలుకరిస్తూ వారితో కలిసి ఫొటోలు దిగారు.








కామెంట్‌లు (0)