యూట్యూబర్ ‘ప్రశ్న’ రావణ్‌ను విచారించిన పోలీసులు
వైద్యపరీక్షలకు తరలిస్తుండగా కోడిగుడ్లతో జనసేన శ్రేణుల దాడి
మరో కేసులో బెయిల్ మంజూరు
ప్రజాశక్తి - కాకినాడ రూరల్ : కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం సర్పవరం పోలీస్ స్టేషన్ వద్ద గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూట్యూబర్ బట్లకూరి జోసెఫ్ అలియాస్ యూట్యూబర్ ‘ప్రశ్న’ రావణ్‌ను వైద్య పరీక్షల కోసం తరలిస్తుండగా జనసేన నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. రావణ్‌ను తమకు అప్పగించాలంటూ వాహనంపై కోడిగుడ్లతో దాడికి దిగారు. డిప్యూటీ సిఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రావణ్‌ను పోలీసులు మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. అనంతరం పిఠాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు. అర్ధరాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. రావణ్ తరుఫున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. అర్ధరాత్రి తరువాత రావణ్‌కు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. అయితే బెయిల్‌పై బయటకు వచ్చిన రావణ్‌ను 2025లో గొల్లప్రోలు మండలంలో విద్యార్థుల గొడవను.. కులాల మధ్య జరిగిన గొడవగా చిత్రీకరిస్తూ వీడియోలు చేశారంటూ నమోదైన పాత కేసులో మళ్లీ రావణ్‌ను సర్పవరం పోలీసులు అరెస్టు చేశారు. గురువారం తెల్లవారుజామున పిఠాపురం నుంచి కాకినాడ రూరల్ మండలం సర్పవరం పిఎస్‌కు తరలించారు. అక్కడ విచారణ అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం కాకినాడ జిజిహెచ్‌కు తరలించేందుకు బయలుదేరారు. ఈ సమయంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. పోలీసు వాహనాలపై కోడిగుడ్లతో దాడి చేశారు. వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదనపు పోలీసు బలగాల మధ్య ఆస్పత్రికి తరలించారు. వాహనం జడ్‌పి సెంటర్‌కు చేరుకునేసరికి జనసేన నాయకులు, కార్యకర్తలు మళ్లీ వాహనాలపై కోడిగుడ్లతో దాడికి పాల్పడారు. పోలీసు బందోబస్తు మధ్య ఎట్టకేలకు రావణ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రావణ్‌కు బెయిల్ మంజూరు చేశారు.








కామెంట్‌లు (0)