గురువారం, 02 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవిబి గ్రామ్ జితో పేదల కడుపు కొట్టొద్దు

1 గంట క్రితం

image
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 02, 2026, 11:34 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • పాత చట్టాన్ని కొనసాగించాలని పని ప్రదేశంలో కార్మికుల ఆందోళనలు

  • వ్యకాస ఆధ్వర్యంలో ఎంపిడిఒ, సచివాలయాల ఎదుట నిరసనలు

ప్రజాశక్తి - యంత్రాంగం : కొత్తగా తీసుకొచ్చిన విబి గ్రామ్ జి పథకంతో పేదల కడుపు కొట్టొద్దని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్నే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాష్ర్టవ్యాప్తంగా పని ప్రదేశంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. ఫేస్ యాప్ ను రద్దు చేయాలని, పని ప్రదేశాల్లో వసతులు, టెంటు, తాగునీరు, రోజుకు రూ. 700 చెల్లించాలని, 200 రోజుల పని కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నూతన పథకం వల్ల రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం పడుతుందని, పథకాన్ని నిర్వీర్యం చేసేందుకే నిధుల్లో కోతలు పెడుతున్నారని పలువురు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో ఎంపిడిఒ, సచివాలయాల ఎదుట నిరసన తెలిపి, అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.

తిరుపతి జిల్లా సత్యవేడులో అంబేద్కర్ విగ్రహం నుంచి మహాత్మా గాంధీ విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకనాథం మాట్లాడుతూ...వామపక్షాల పోరాట ఫలితంగా తీసుకొచ్చిన గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని గాడ్సే వారసులు రద్దు చేసి ఆ స్థానంలో విబి గ్రామ్ జి పథకాన్ని తీసుకువస్తే రాష్ట్రంలోని టిడిపి, జనసేన, వైసిపి మద్దతు పలకడం దుర్మార్గమన్నారు. ఎన్ డిఎ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు 40 శాతం భారాన్ని భరించలేమని మోడీకి మొరపెట్టుకుంటుంటే, కూటమి ప్రభుత్వం దాసోహమవ్వడం ఏమిటని ప్రశ్నించారు. కార్పొరేట్ కంపెనీలకు ముఖ్యంగా అదాని ,అంబానిలకు 16 లక్షల కోట్ల రూపాయల రాయితీలు ప్రకటించిన మోడీ ప్రభుత్వం, ఉపాధి హామీ పథకంలో 90 శాతం నిధులు ఇవ్వలేరా? అని నిలదీశారు. విబి గ్రామ్ జి పథకంలో పేరుకు 125 రోజులు పని ఇస్తామని చెప్పినప్పటికీ వ్యవసాయ పనుల సీజన్లో 60 రోజులు పనిని నిషేధించారని గుర్తు చేశారు. ఇలా చేయడం వల్ల పనులు దొరక్క కార్మికులు వలసలు వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఫేస్ యాప్ వల్ల మస్టర్ లో పేరు నమోదు కాక వేలాది మంది కార్మికులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వందవాసి నాగరాజు మాట్లాడుతూ.. చంద్రబాబు తన సొంత జిల్లాలోని కార్మికులకు, వ్యవసాయ కార్మికులకు ద్రోహం చేసే విధంగా విబి గ్రామ్ జిని ప్రారంభించటం సిగ్గుచేటన్నారు. పని ప్రదేశాల్లో వసతులు, టెంటు, తాగునీరు, రోజుకు రూ. 700 చెల్లించాలని, 200 రోజుల పని కల్పించాలని డిమాండ్ చేశారు.

image

నెల్లూరు జిల్లాలో పలుచోట్ల ఎంపిడిఒ కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం బొడ్డువలసలో నిరసన తెలిపారు. గంట్యాడ మండలం బుడతనాపల్లి సచివాలయం వద్ద ఆందోళన చేపట్టారు. రేగిడిమండలం పారంపేట గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఉపాధి హామీ పథకం సమస్యలపై వినతి పత్రం అందించారు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ జెడ్.జోగంపేట, అజయ్ పురం గ్రామాలకు చెందిన ఉపాధి కార్మికులు పని ప్రదేశాల్లో నిరసన తెలిపారు. ముగనపాక మండలం వెంకటాపురం గ్రామంలో ఆందోళన చేపట్టారు. పల్నాడు జిల్లా ముప్పాళ మండలంలో మాదల గ్రామంలో నిరసన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మెట్టూరు-3లో నిరసన తెలియజేశారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడిలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. చల్లపల్లి మండలంలో పని ప్రదేశం వద్ద నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం సంకువాని గుంట గ్రామంలో పని ప్రదేశంలో ఆందోళన చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం రూరల్ తాడేరు గ్రామంలో తాడేరు గ్రామ సచివాలయం వద్ద ఉపాధి హామీ కార్మికులు నిరసన తెలిపి డిజిటల్ అసిస్టెంట్ వెంకటేష్ కి వినతి పత్రం అంద జేశారు. పెనుమంట్ర, పొలమూరులో ఆందోళన చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్