ట్రాన్స్‌కో జెఎండికి డివైఎఫ్‌ఐ వినతి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్ సంస్థల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఎఇఇ) పరీక్షల కోసం సిద్ధమయ్యేందుకు అభ్యర్ధులకు సమయాన్ని పొడిగించాలని డివైఎఫ్‌ఐ కోరింది. ఈ మేరకు ట్రాన్స్‌కో జెఎండి సూర్యసాయి ప్రవీణ్ చంద్‌ను ఫెడరేషన్ నాయకులు విజయవాడలోని విద్యుత్ సౌధలో గురువారం కలిసి వినతిపత్రం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడేళ్ల తర్వాత విద్యుత్ సంస్థల్లో ఎఇఇ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసిందని తెలిపారు. జూన్ 30 నుంచి ఈనెల 20వ తేది వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారని, ఆగస్టు 22నుంచి పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారని తెలిపారు. అయితే పరీక్ష సమయానికి 53రోజులు సమయం మాత్రమే ఉండటం వల్ల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పరీక్షలకు సమయం పెంచాలని కోరారు. సిలబస్‌లో మార్పులు చేసి, అన్ని సంస్థలకు ఒకే పరీక్ష నిర్వహిస్తుండంతో అభ్యర్థులకు సిద్ధమయ్యేందుకు తగిన సమయం ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు కోచింగ్ సెంటర్లు, లైబ్రరీలు, నాణ్యమైన స్టడీ మెటీరియల్ వంటి సౌకర్యాలు పరిమితంగా ఉండటం వల్ల కొత్త సిలబస్‌కు తక్కువ సమయంలో సిద్ధం కావడం చాలా కష్టంగా మారుతోందని పేర్కొన్నారు. అందువల్ల అభ్యర్థులందరికీ సమాన అవకాశం కల్పించేలా ఏఇఇ పరీక్షను కొంతకాలం వాయిదా వేసి, అదనపు ప్రిపరేషన్ సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ ప్రక్రియ మొత్తం వివాదాలు లేకుండా, పారదర్శకంగా, సమాన అవకాశాలతో నియామక ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. దరఖాస్తు చేసుకునేందుకు కుల ధృవీకరణ, సచివాలయ, ఇతర ఉద్యోగాలు ఎన్‌ఓసి సర్టిఫికేట్ పొందుపరచాలని, వీటికోసమే 15-20 రోజులు సమయం పడుతుందని తెలిపారు. కాబట్టి అభ్యర్ధుల ఇబ్బందులు నేపథ్యంలో దరఖాస్తుకు గడువు పెంచాలని కోరారు. జెఎండిని కలిసిన వారిలో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వై రాము, జి రామన్న, విజయవాడ నగర కార్యదర్శి శివ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)