గురువారం, 02 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionస్పీడ్ పోస్ట్ ద్వారా గంజాయి సరఫరా

1 గంట క్రితం

ganja
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 02, 2026, 11:14 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టు

  • జార్ఖండ్ కేంద్రంగా భారీ నెట్‌వర్క్

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : పోస్టల్, కొరియర్ సేవల ద్వారా దేశవ్యాప్తంగా నిషేధిత గంజాయి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్(హెచ్-న్యూ) బయటపెట్టారు. జార్ఖండ్‌ కేంద్రంగా ఈ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను సాగిస్తున్న సూత్రధారుడిని అరెస్టు చేసింది. కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్‌ బంజారాహిల్స్‌‌లోని ‌ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి సజ్జనార్‌ ‌వివరాలు వెల్లడించారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సత్యం మిశ్రా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంటర్మీడియట్ మధ్యలోనే ఆపేశాడు. జీవనోపాధి కోసం మొదట్లో పెయింటర్‌గా, ఆ తర్వాత లారీ డ్రైవర్‌గా మారాడు. లారీల్లో వివిధ రాష్ట్రాలకు సరుకులను చేరవేసే క్రమంలో అతడు తరచూ ముంబయికి వెళ్లేవారు. ఈ నేపథ్యంలో 2018లో గంజాయికి బానిసైన సత్యం మిశ్రాకు డ్రగ్స్ వినియోగించే వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో తన అన్న శుభమ్ మిశ్రాతో కలిసి దందా ప్రారంభించారు. బంధువు సచిన్ మిశ్రా, రాహుల్ ఝా, సంతోష్ పండిట్‌తో కలిసి ఒక ముఠాగా ఏర్పడి అక్రమ గంజాయి వ్యాపారంలోకి దిగాడు. జార్ఖండ్‌లోని తమ స్వగ్రామంలో గంజాయిని పండించడంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి గంజాయిని సేకరించి హైదరాబాద్, ముంబై, చెన్నయ్‌, కేరళ, రాజస్థాన్, జార్ఖండ్, ఢిల్లీ, బెంగళూరు సహా దేశవ్యాప్తంగా దాదాపు 21 రాష్ట్రాల్లో కస్టమర్లకు సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం జార్ఖండ్‌లోని ఇస్రీ బజార్, ఫుస్రో బజార్ పోస్ట్ ఆఫీసులు ద్వారా పార్శిళ్లను పంపేవారు. వాట్సప్, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా ఆర్డర్లు స్వీకరించి, డెలివరీ వివరాలు, చెల్లింపులను సమన్వయం చేసుకునేవారు. రోజుకు సగటున 80 నుంచి 100 ఆర్డర్లను పంపించేవారు. ఏడాదికి సుమారు రూ. నాలుగు నుంచి ఐదు కోట్ల భారీ టర్నోవర్‌తో ఈ అక్రమ దందా సాగించినట్టు పోలీసుల విచారణలో తేలింది. తపాలా సేవల ద్వారా పంపడమే కాకుండా, ముంబై నగరంలో కూడా వీరు భారీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు. పోలీసుల కళ్లు గప్పేందుకు వీరు 'మ్యాంగో, స్టిక్ , ఫ్లవర్ ' వంటి కోడ్ పదాలను పంపించేవారు.

ఇదే తరహాలో ఇస్రీ బజార్ పోస్ట్ ఆఫీస్ ద్వారా హైదరాబాద్‌కు చెందిన ఒకరికి ఈ ముఠా గంజాయి పార్సల్ అందడంతో హెచ్-న్యూ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ఈ సరఫరా లింక్ బయటపడింది. గంజాయిని బుక్‌ చేసుకున్న హైదరాబాద్‌కు చెందిన సుశాంత్‌ వ్యాస్‌, లడ్డును అరెస్టు చేసి, రెండు కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు సత్యం మిశ్రాను రిమాండ్‌కు తరలించగా, పరారీలో ఉన్న మిగిలిన నలుగురు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని సిపి తెలిపారు. ​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్