డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వాక్ స్వాతంత్ర్యం అనేది అపరిమితమైన హక్కు కాదని, దానికీ కొన్ని పరిమితులున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తెలిపారు. ఇతరుల హక్కులను కాలరాసే హక్కు దానికి లేదన్నారు. ‘వాక్ స్వాతంత్ర్యం-సోషల్ మీడియా దుర్వినియోగంపై’ బుధవారం సామాజిక మాధ్యమం ద్వారా ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును మనస్ఫూర్తిగా స్వాగతిస్తామని, అయితే సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే మాత్రం ఎంత మాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. సోషల్ మీడియాలో మత విశ్వాసాలను గాయపరచడం, వ్యక్తిగత ధూషణలకు దిగడం, హత్యా బెదిరింపులకు పాల్పడడం, ఉద్దేశపూర్వకంగా దుష్ర్పచారం చేయడం సమంజసం కాదన్నారు. ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం అవసరమైతే కొత్త చట్టాలు, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. కొన్నేళ్లుగా సోషల్ మీడియాను కొందరు తప్పుడు పనులకు వాడుతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. నేరానికి కులం, మతం, రాజకీయ పార్టీ అనే తేడాలు ఉండవని, తప్పు చేసిన తర్వాత వాటి వెనుక దాక్కోవాలని ఎవరూ ప్రయత్నించొద్దన్నారు. సోషల్ మీడియాలో వేధింపులు, ధూషణల వల్ల ఇబ్బందులు పడుతున్న బాధితులందరికీ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని చెప్పారు. ఈ ఫిర్యాదులు తీసుకోవడానికి తన కార్యాలయంలో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.








కామెంట్‌లు (0)