పిఠాపురం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
ప్రజాశక్తి - పిఠాపురం : యూట్యూబర్ ప్రశ్న రావణ్ ను పిఠాపురం పోలీసులు హైదరాబాద్ లో మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అతన్ని బుధవారం ఉదయం పిఠాపురం పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. ఏలూరులో జరిగిన బహిరంగ సభలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పిఠాపురం జనసేన నాయకుడు, పిఠాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ సభ్యుడు బొజ్జా కుమార్ బాబు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో రావణ్ పై పలు సెక్షన్ల్ కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో విచారించారు. సమాచారం తెలుసుకున్న సామాజిక కార్యకర్త బొజ్జా ఐశ్వర్య ,జై భీమ్ భారత్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ కన్వీనర్ జె.మల్లికార్జున పరువురు దళిత సంఘం నాయకులు స్టేషన్ కు చేరుకున్నారు. రావణ్ ను తమకు చూపించాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు, నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఇద్దరు న్యాయవాదులను రావణ్ ను చూసేందుకు పోలీసులు అనుమతించారు. ఈ సందర్భంగా మీడియాతో బొజ్జ ఐశ్వర్య మాట్లాడారు. సోషల్ మీడియాలో తన గొంతు వినిపిస్తున్న రావణ్ ను గత రాత్రి హైదరాబాదులో పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారన్నారు. కనీసం ఎటువంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారికి సమాధానాలు చెప్పలేక అక్రమంగా కేసులు బనాయిస్తున్నారన్నారు.
నినాదాలతో ఉద్రిక్తత
విచారణ అనంతరం రావణ్ ను వైద్య పరీక్షలకు తరలించేందుకు పోలీసులు సిద్ధ మయ్యారు. ఈ సమయంలో పెద్దసంఖ్యలో అక్కడకు జనసేన కార్యకర్తలు వచ్చారు. రావణ్ ను తరలించే క్రమంలో జనసేన కార్యకర్తలు, దళిత సంఘాల నాయకులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ ఒకరినొకరు తోసుకున్నారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు వైద్యులనే పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు.








కామెంట్‌లు (0)