శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

జనావాసాల మధ్య డేటా సెంటర్లు వద్దు : వామపక్షాలు

27 జులై, 2026

data
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 09:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • తర్లువాడ వెళ్లకుండా నాయకులను అడ్డుకున్న పోలీసులు

  • 37 మంది అరెస్టు

ప్రజాశక్తి - ఆనందపురం, కలెక్టరేట్‌ (విశాఖపట్నం)

విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో ప్రతిపాదిత ‌గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు సోమవారం నిరసన ర్యాలీ చేపట్టగా పోలీసులు నిర్బంధం ప్రయోగించారు. 37 మందిని అరెస్టు చేసి, సాయంత్రం వరకూ ఆనందపురం పోలీస్‌‌ స్టేషన్‌‌లో నిర్బంధించారు. ప్రభుత్వ, పోలీసు చర్యలను సిఐటియు, పలు ప్రజా సంఘాలు ఖండించాయి. జనావాసాల మధ్య డేటా సెంటర్లు ఏర్పాటు చేయొద్దంటూ సిపిఎం, సిపిఐ, సిపిఐ ఎంఎల్ ప్రజా పోరు, ఎస్‌‌యుసిఐ తదితర వామపక్ష పార్టీల నాయకులు విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం నుంచి బైకు ర్యాలీగా తర్లువాడకు బయలుదేరారు. వారిని తర్లువాడకు సమీపంలోని జాతీయ రహదారిపై పోలీసులు అడ్డుకుని ఆనందపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టుల క్రమంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం, విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌‌కె.రహిమాన్, ఎస్‌‌యుసిఐ జిల్లా కార్యదర్శి గోవిందరాజులు, సిపిఐ ఎంఎల్ ప్రజా పోరు జిల్లా కార్యదర్శి కె. దేవసహాయం మాట్లాడుతూ సింహాచలం సమీపంలోని ముడసర్లోవ రిజర్వాయర్ రెండు లక్షల మందికి తాగునీటిని అందించే ప్రధాన వనరని గుర్తుచేస్తూ ఆ ప్రాంతంలో డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల నీటి వనరులపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. తర్లువాడ, ముడసర్లోవ, రాంబిల్లి ప్రాంతాల్లో ప్రతిపాదిత డేటా సెంటర్ ప్రాజెక్టులను ప్రభుత్వం పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. డేటా సెంటర్ల వల్ల ప్రజలకు ప్రయోజనమైతే తర్లువాడ గ్రామాన్ని, డేటా సెంటర్‌‌ ప్రతిపాదిత ప్రాంతాన్ని వామపక్ష పార్టీలు పర్యటించకుండా ప్రభుత్వం పోలీస్ నిర్బంధాన్ని ఎందుకు ప్రయోగిస్తోందని నిలదీశారు. నిర్బంధం ఆపకపోతే గత పాలకులకు పట్టిన గతే చంద్రబాబు ప్రభుత్వానికీ పడుతుందని హెచ్చరించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం, జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్ బి. గంగారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌‌కె.రహిమాన్‌, జిల్లా నాయకులు ఎ.విమల, ఎం.పైడిరాజు, ఎం.మన్మధరావు, ఎస్‌‌యుసిఐ జిల్లా కార్యదర్శి గోవిందరాజులు, ప్రజాపోరు జిల్లా కార్యదర్శి కె.దేవ సహాయం, సిపిఎం భీమిలి జోన్ కార్యదర్శి ఆర్ఎస్ఎన్.మూర్తి, నాయకులు అప్పలనాయుడు, యుఎస్ఎన్.రాజు ఎల్‌‌జె.నాయుడు సహా 37 మంది ఉన్నారు. వారిని సాయంత్రం విడుదల చేశారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్