- రాయలసీమ జెన్ స్టార్స్‌పై ఏడు పరుగుల తేడాతో గెలుపు
- అర్ధ సెంచరీతో మెరిసిన రంగ లక్ష్మి
- డబ్ల్యుఎపిఎల్ లో తొలి హ్యాట్రిక్ తీసిన పూజిత
ప్రజాశక్తి - విజయవాడ అర్బన్ : మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో అమరావతి ఇ- ఛాంపియన్స్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. రాయలసీమ జెన్ స్టార్స్‌తో జరిగిన ఉత్కంఠ భరితమైన పోరులో ఏడు పరుగుల తేడాతో అమరావతి జట్టు విజయం సాధించింది.టాస్ గెలిచిన రాయలసీమ జెన్ స్టార్స్ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన అమరావతి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 163 పరుగులు సాధించింది. ఓపెనర్ రంగ లక్ష్మి 44 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 50 పరుగులు చేశారు. మరో ఓపెనర్ అనూష 41 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 46 పరుగులు సాధించారు. అనంతరం వచ్చిన కాట్రగడ్డ దీక్ష కేవలం 22 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 48 పరుగులు చేశారు. ఆమె అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. రాయలసీమ జెన్ స్టార్స్ బౌలర్లలో పద్మజ, అనూష, పూజిత తలో వికెట్ తీశారు.163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయలసీమ జెన్ స్టార్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో అమరావతి ఇ-ఛాంపియన్స్ జట్టు ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. రాయలసీమ బ్యాటర్లలో గ్రీష్మ 24 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 39 పరుగులు చేసి ఆకట్టుకోగా, శుభశ్రీ 15 బంతుల్లో నాలుగు ఫోర్లతో 22 పరుగులు చేశారు. అయితే మిగిలిన బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో రాయలసీమ జట్టు లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. అమరావతి బౌలర్లలో సాయి పూజిత నాలుగు వికెట్లు తీయగా, కాండ్రేగుల దేవిక రెండు వికెట్లు తీసింది. సాయి దీప్తి, జోషి చెరో వికెట్ సాధించారు.








కామెంట్‌లు (0)