- కార్మిక, ప్రజా సంఘాల జెఎసి నాయకులు
- విశాఖలో 2000 రోజులకు స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ దీక్షలు
ప్రజాశక్తి - కలెక్టరేట్ (విశాఖపట్నం) : వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ బారి నుంచి రక్షించుకునేందుకు ఎటువంటి పోరాటాలు, త్యాగాలకైనా కార్మికవర్గం, ప్రజలు సిద్ధంగా ఉన్నారని అఖిలపక్ష కార్మిక, ప్రజాసంఘాల జెఎసి నాయకులు తెలిపారు. త్యాగాలతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి మరిన్ని ఉధృత పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ నగరంలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద జెఎసి ఆధ్వర్యంలో తలపెట్టిన రిలే దీక్షలు ఆదివారానికి 2,000 రోజులకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆ శిబిరం వద్ద సభ నిర్వహించారు. సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్, ఐఎన్‌టియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి భోగవిల్లి నాగభూషణం అధ్యక్షత వహించారు. సభలో జెఎసి చైర్మన్ ఎం.జగ్గునాయుడు, నాయకులు డి.ఆదినా రాయణ, జె.అయోధ్యరామ్, పివి.సురేష్, ఎన్.కనకారావు, రామచంద్రరావు మాట్లాడారు. 2021 జనవరి 27న కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌ను స్టాటజిక్ సేల్ పేరిట వంద శాతం ప్రైవేటీకరణ చేసేందుకు ప్రకటన చేసిందని, అప్పటి నుంచి పలు రూపాల్లో ఆందోళనలు జరుగుతున్నాయన్నారు. కూర్మన్నపాలెం జంక్షన్లో స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు చేస్తున్న నిరసన దీక్షలకు సంఘీభావంగా జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద జిల్లాలోని అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యంలో 2021 ఏప్రిల్ రెండు నుంచి దీక్షలు ప్రారంభించామని తెలిపారు. కరోనా సమయంలోనూ ఈ దీక్షలు నిరాటంకంగా కొనసాగిన విషయాన్ని గుర్తుచేశారు.
అన్ని రంగాల కార్మికులు, ప్రజల ఉక్కు పరిరక్షణ పోరాటంలో భాగస్వాములయ్యారని వివరించారు. ఐక్యంగా పోరాడటం వల్లే ఇప్పటికీ ప్రభుత్వ రంగంలోనే విశాఖ స్టీల్‌ప్లాంట్ కొనసాగుతోందన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నా, ప్లాంట్‌ను ఆర్థిక దిగ్బంధనం చేస్తున్నా కార్మికులు పట్టుదలగా పోరాడుతున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడికి తలొగ్గి స్టీల్ పాంట్ యాజమాన్యం ప్లాంట్‌లోని ఆరు వేల మంది కాంట్రాక్టు కార్మికులను విధుల నుండి తొలగించిందని, రెండు వేల మంది ఉద్యోగులను విఆర్ఎస్ పేరుతో ఇంటికి పంపిందని వివరించారు. సొంత గనులు కేటాయించకుండా ఆటంకాలు సృష్టిస్తుండడం తగదన్నారు. ప్రభుత్వ రంగంలోని వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు కాకుండా నక్కపల్లిలో నిర్మిస్తోన్న మిట్టల్ ప్రైవేటు స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు ఇవ్వాలని రాష్ట్రంలోని ఎంపిలందరూ ప్రధానిని కోరడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో సిఐటియు, ఐఎన్‌టియుసి, వైఎస్‌ఆర్‌టియు, ఎపిఎఫ్‌టియు, సిఎఫ్‌టియుఐ, ఎఐసిసిటియు, హెచ్ఎంఎస్ డిఎస్ఇయు నాయకులు, అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లోని కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)