ఆస్ట్రియాపై 3-0తో ఘన విజయం.. డబుల్ గోల్స్‌తో మెరిసిన ఒయార్జాబాల్
లాస్ ఏంజెల్స్ : ఫిఫా ప్రపంచకప్‌లో స్పెయిన్ జట్టు ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్-32లో భాగంగా లాస్ ఏంజెల్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రియాను 3-0తో చిత్తు చేసింది. మికెల్ ఒయార్జాబాల్ (37, 89 నిమిషాలు) రెండు గోల్స్‌తో చెలరేగగా, పెడ్రో పోరో (66వ నిమిషం) మరో గోల్ నమోదు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
మ్యాచ్ ఆరంభం నుంచే స్పెయిన్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి అర్ధభాగంలో ఎడమవైపు నుంచి వచ్చిన లో క్రాస్‌ను ఒయార్జాబాల్ గోల్‌గా మలిచి జట్టుకు ఆధిక్యం అందించాడు. రెండో అర్ధభాగంలో పెడ్రో పోరో అద్భుతమైన హెడర్‌తో స్కోరును 2-0కు పెంచాడు. చివరి నిమిషంలో మరోసారి లో క్రాస్‌ను అందుకున్న ఒయార్జాబాల్ తన రెండో గోల్‌ను నమోదు చేసి స్పెయిన్ విజయాన్ని ఖరారు చేశాడు. ఈ రెండు గోల్స్‌తో టోర్నీలో అతని గోల్స్ సంఖ్య నాలుగుకు చేరింది. రక్షణలోనూ స్పెయిన్ అద్భుతంగా రాణించింది. మొత్తం మ్యాచ్‌లో ఆస్ట్రియాను కేవలం ఐదు షాట్లకే పరిమితం చేయడమే కాకుండా, ఒక్కసారి కూడా లక్ష్యంపై షాట్ కొట్టే అవకాశం ఇవ్వలేదు. ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ దశలో స్పెయిన్ రెండు కంటే ఎక్కువ గోల్స్ నమోదు చేయడం 1994 తర్వాత ఇదే తొలిసారి. అప్పట్లో స్విట్జర్లాండ్‌పై 3-0తో విజయం సాధించింది. లామినే యమాల్, పౌ కుబార్సీ ఒకే జట్టులో ఆడుతున్న ఇద్దరు టీనేజ్ ఆటగాళ్లుగా మరో అరుదైన ఘనత సాధించారు. ఈ జోడీ బ్రెజిల్ దిగ్గజాలు పీలే, జోస్ అల్టాఫిని పేరిట 68 ఏళ్లుగా కొనసాగుతున్న రికార్డును అధిగమించింది. ఇక ప్రిక్వార్టర్స్‌లో స్పెయిన్.. క్రొయేషియా-పోర్చుగల్ మ్యాచ్ విజేతతో అమీతుమీ తేల్చుకోనుంది.
ఉనై సైమన్ పేరిట గిన్నిస్ రికార్డు
స్పెయిన్ గోల్‌కీపర్ ఉనై సైమన్ ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గ్రూప్ దశ నుంచి ఆస్ట్రియాతో జరిగిన నాకౌట్ మ్యాచ్ వరకు వరుసగా 519 నిమిషాల పాటు ఒక్క గోల్ కూడా సమర్పించకుండా నిలిచి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. దీంతో 1990 ప్రపంచకప్‌లో ఇటలీ దిగ్గజ గోల్‌కీపర్ వాల్టర్ జెంగా పేరిట ఉన్న 517 నిమిషాల రికార్డును అధిగమించి కొత్త చరిత్ర సృష్టించాడు.








కామెంట్‌లు (0)