mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎల్‌నినోను ఎదుర్కొనేలా సాగు

1 రోజు క్రితం

cm review
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 18, 2026, 12:49 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

• డిమాండ్ ఉన్న పప్పు దినుసుల సాగుకు ప్రణాళికలు

సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

​ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎల్‌నినో ప్రభావంతో ప్రత్యేక వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో పంటల సాగు విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పంటల మార్పిడికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా రంగాలపై బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ, వాణిజ్య, ఉద్యాన పంటల సాగుపై రైతులకు సూచనలివ్వాలని నిర్దేశించారు. రాష్ట్రంలోని రైతులు పెద్దయెత్తున ప్రకృతి సేద్యం వైపు మళ్లేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో సర్టిఫికేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని, ఈ విషయాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సి ఉందని అన్నారు. రైతులను చైతన్యపరిచే కార్యక్రమాల్లో తాను పాల్గొంటానని పేర్కొన్నారు. శాస్త్రీయ విధానంలో పంటలు సాగును తెలియజేయాల్సి ఉందన్నారు. మిర్చి, పొగాకు, తోతాపురి మామిడి ఉత్పత్తులకు సంబంధించిన అంశాలపై అధికారులకు సిఎం దిశానిర్దేశం చేశారు. పొగాకు కొనుగోలుదారులతో సమావేశం ఏర్పాటుచేయాలని ఆదేశించారు. గిట్టుబాటు ధర వచ్చే వరకూ నిల్వ చేసుకునే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. మార్కెట్‌లో ఎక్కువ డిమాండ్ ఉన్న పప్పు దినుసులు సాగు చేసేందుకు వీలుగా ప్రణాళికలు చేయాలని, తద్వారా రైతులకు ప్రయోజనం కలిగించాలని పేర్కొన్నారు. మార్కెట్‌లో ఉన్న ఉత్పత్తులతో పాటు ప్రస్తుతం సాగు దశలో ఉన్న పంటల్ని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ తదుపరి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. వ్యవసాయం, ఉద్యాన పంటల విషయంలో అదనపు విలువ జోడించాలని సూచించారు. ఆక్వా రైతులు, అసోసియేషన్లతో పాటు ఆక్వా ఫీడ్ తయారీదారులతోనూ సమావేశం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కష్టకాలంలో ఉన్న రైతులను ఆదుకోవటమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని సిఎం అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, వ్యవసాయ, ఉద్యాన, మత్స్యశాఖ, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


సంజీవనితో యోగా అనుసంధానం

సంజీవని కార్యక్రమంతో అనుసంధానం ద్వారా యోగాను రాష్ట్రంలో ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని వైద్యారోగ్యశాఖ అధికారులకు సిఎం చంద్రబాబు సూచించారు. ఆరోగ్యంపై అందరూ ధ్యాస పెట్టేలా, యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ నెల 21న యోగా డే కార్యక్రమం నిర్వహణపై సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనే వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని సిఎం నిర్దేశించారు. ‘ఇంటింటికీ యోగా’ ప్రధాన థీమ్‌గా ఏడాది పాటు కార్యాచరణ ప్రణాళిక చేయాలని అన్నారు. వివిధ వైద్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారి కోసం ప్రత్యేక ‘థెరప్యూటిక్ యోగా’ కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయాలన్నారు. బాబా రామ్‌దేవ్‌‌తో కలిసి ఈ నెల 20న ఉండవల్లి గుహల వద్ద, 21న విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్రస్థాయి కార్యక్రమంలో పాల్గొంటానని తెలిపారు. స్టేడియంలో 5- 6 వేల మంది యోగా చేసేలా ఏర్పాట్లు చేసినట్టు సిఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. వర్షం కారణంగా ఏమైనా అవాంతరం తలెత్తితే.. ప్రత్యామ్నాయంగా విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో వెయ్యి మందితో నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. యోగా డేలో పాల్గొనేందుకు ఇప్పటికే కోటి మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. 21న 1.33 లక్షల సెంటర్లలో యోగా కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణరాజు, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కెవిఎన్‌ చక్రధర్ బాబు, ఎన్‌‌టిఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా, ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ తదితరులు ‌పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్