బుధవారం, 19 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పంజాబ్‌ ఎన్నికల కోసమే నన్ను టార్గెట్‌ చేశారు : సత్యేందర్‌ జైన్‌

1 గంట క్రితం

Satyendar Jain
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 01:21 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఉద్దేశపూర్వకంగానే తనను బిజెపి ప్రభుత్వం టార్గెట్‌ చేసిందని ఆప్‌ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌ మండిపడ్డారు. ఢిల్లీ జల బోర్డు (డిజెబి) టెండరింగ్‌ ప్రక్రియలో అవకతవకల ఆరోపణలపై అవినీతినిరోధక శాఖ (ఎసిబి) తనను అరెస్టు చేయడంపై ఆయన బుధవారం స్పందించారు. పంజాబ్‌ ఎన్నికల కోసమే తనను లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. కోర్టులో హాజరుపరిచే ముందు మీడియాతో మాట్లాడుతూ.. తన అరెస్టు రాజకీయ కక్షసాధింపు చర్యలో భాగమేనని ఆరోపించారు. ఆయన తరఫు న్యాయవాది మణిందర్‌ సింగ్‌ మాట్లాడుతూ, అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించారని, అరెస్టుకు తగిన కారణాలు లేవని వాదించారు. సత్యేందర్‌ జైన్‌ అరెస్టు బిజెపి కుట్ర, కక్షసాధింపు చర్య అని ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అతిషి ఆరోపించారు. పంజాబ్‌ ఎన్నికలకు ముందు ఆయనను మరోసారి టార్గెట్‌ చేశారని విమర్శించారు. ఇటీవల ఢిల్లీలో వెలుగుచూసిన పలు కుంభకోణాల్లో బిజెపి నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 2022-23లో జరిగిన పరిణామాలనే బిజెపి మళ్లీ పునరావృతం చేస్తోందని అతిషి అన్నారు. గతంలో సత్యేందర్‌ జైన్‌ను కల్పిత కేసులో ఇరికించి రెండేళ్లపాటు జైలులో ఉంచారని, ఆయనపై ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో ఆ అరెస్టు అన్యాయమని తేలిందని గుర్తుచేశారు. గతంలో హిమాచల్‌ప్రదేశ్‌ పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్న జైన్‌ను ఎన్నికల సమయంలో టార్గెట్‌ చేశారని, ప్రస్తుతం ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న పంజాబ్‌కు సహ ఇన్‌చార్జ్‌గా ఉన్నందున మరోసారి బిజెపి కుట్రలో భాగంగా ఆయనను లక్ష్యంగా చేసుకున్నారని అతిషి ఆరోపించారు. పంజాబ్‌లో ఆప్‌ను వేధించేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నాలకు ప్రజలు ఎన్నికల్లో తగిన సమాధానం ఇస్తారని ఆమె అన్నారు.

సత్యేందర్ జైన్‌తో పాటు, ఢిల్లీ జల్ బోర్డ్ మాజీ సిఇఒ ఉదిత్ ప్రకాష్ రాయ్ (ఐఎఎస్‌), ఢిల్లీ జల్ బోర్డ్ మాజీ కాంట్రాక్చువల్ కన్సల్టెంట్ అంకిత్ శ్రీవాస్తవ, ఎఎన్‌ ఎంటర్‌ప్రైజెస్ యజమాని నాగేంద్ర యాదవ్, యూరోటెక్ ఎన్విరాన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని రాజా కుమార్ కుర్రా, సృజన్‌హార్ యజమాని పంకజ్ వర్మలను ఎసిబి రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరచనుంది. అవినీతి నిరోధక సవరణ చట్టం , 2018, ఐపిసి సెక్ష‍న్ల కింద 2024 మేలో ఎసిబి నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా వారిని అరెస్టు చేసినట్లు తెలిపింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్