- పనులకు నేడు శంకుస్థాపన చేయనున్న సిఎం చంద్రబాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఆధునీకరణలో భాగంగా రూ.152.95 కోట్ల వ్యయంతో 117 పాత వరద గేట్లను అత్యాధునిక గేట్లుగా మార్చే పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిచ్చుకలంక వద్ద శంకుస్థాపన చేయనున్నారు. 1847లో ప్రారంభమై 1852లో పూర్తయిన ధవళేశ్వరం ఆనకట్ట గోదావరి జలాలను వ్యవసాయానికి మళ్లించి డెల్టాను దేశంలోనే అత్యంత సారవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించింది. అనంతరం 1969లో ప్రారంభమైన ఆధునిక సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ నిర్మాణం 1984లో పూర్తయింది. సుమారు 5.83 కిలోమీటర్ల పొడవున్న ఈ బ్యారేజీ ప్రస్తుతం 10.13 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడంతో పాటు లక్షలాది మందికి తాగునీటి ప్రధాన ఆధారంగా నిలుస్తోంది. వరద నియంత్రణలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తోంది. నాలుగు దశాబ్దాలుగా నిరంతర వినియోగం, భారీ వరదల ఒత్తిడి, యాంత్రిక భాగాల శిథిలీకరణ నేపథ్యంలో కేంద్ర జల సంఘం, డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ తదితర నిపుణుల కమిటీల సిఫార్సుల మేరకు ప్రభుత్వం ప్రాజెక్టును ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టింది. 2014–15లో తొలి దశలో 175 గేట్లలో 58 గేట్లను రూ.31.77 కోట్లతో మార్చగా, ఇప్పుడు మిగిలిన 117 గేట్ల మార్పిడితో పాటు మొత్తం 175 గేట్లకు కొత్త రబ్బర్ సీల్స్, రోలర్ అసెంబ్లీలు, వైర్ రోపులు, మాస్టర్ కంట్రోల్ ప్యానెల్స్, విద్యుత్ కేబుళ్లు, శాండ్ బ్లాస్టింగ్, పెయింటింగ్ వంటి సమగ్ర ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు.








కామెంట్‌లు (0)