ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

వర్జీనియా పొగాకు సంక్షోభాన్ని పరిష్కరించాలి

1 రోజు క్రితం

vsr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 31, 2026, 06:34 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- రూ.1000 కోట్లు సొసైటీకి కేటాయించి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

- సిఎంకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు లేఖ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : వర్జీనియా పొగాకు సంక్షోభాన్ని పరిష్కరించాలని, రూ.1000 కోట్లు సొసైటీకి కేటాయించి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కోరారు. ఈ మేరకు శుక్రవారం లేఖ రాశారు. వర్జీనియా పొగాకు ధరలేక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయని తెలిపారు. దీనిపై రైతులు 100 రోజులుగా ఆందోళన చేస్తున్నారని, సమస్య తీవ్రంగానే కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ స్థితిలో మూడు రోజులక్రితం సిఎంగా ప్రతిపాదించిన ధర మార్కెట్ ధరకంటే తక్కువగా ఉందని, ఇది రైతులను మరింత ఆందోళనలోకి నెట్టివేసిందని పేర్కొన్నారు. మార్కెట్‌లో ప్రస్తుతం పొగాకు ఏగ్రేడ్‌కు ధర రూ.250, బిగ్రేడ్ ధర రూ.195, సిగ్రేడ్ ధర రూ.160 ఉండగా అంతకన్నా తక్కువగా ఏగ్రేడ్‌కు రూ.240, బిగ్రేడ్‌కు రూ.190, సిగ్రేడ్‌కు రూ.100 ఉండాలని ప్రతిపాదించారని తెలిపారు. ధర వ్యత్యాసం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కిలోకు రూ.20 బోనస్ ఇస్తామని, అందుకోసం రూ.188 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారని, బోనస్ కావాలని ఏ రైతూ అడగలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో పోటీని సృష్టించడానికి సొసైటీ ద్వారా ప్రభుత్వమే వెయ్యికోట్లు కేటాయించి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్న విషయం ముఖ్యమంత్రి దృష్టిలో ఉందని గుర్తుచేశారు. గత అనుభవాన్ని బట్టి అది ప్రభుత్వంపై ఎలాంటి భారాన్ని మోపదని, ప్రకటించిన ధర వ్యత్యాసం విధానం రైతులకన్నా కంపెనీలకే ఎక్కువ లాభం చేకూరుస్తుందని వివరించారు. ఈ ప్రకటన రైతులను హతాశులను చేసిందని, ఈ సంవత్సరం 240 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి కాగా ఇప్పటికీ కంపెనీలు కొన్నది 34 మిలియన్ల కేజీలు (14 శాతం) మాత్రమేనని తెలిపారు. మరలా సీజన్ దగ్గరపడుతోందని, ఉన్న నిల్వలు రైతులను కుంగదీస్తున్నాయని పేర్కొన్నారు. పచ్చాకు కూలీలకు సైతం చెల్లింపులు చేయలేని దుస్థితిలో రైతులున్నారని, కనీసం సగటు ధర రూ.250 కూడా లేకుండా రైతులు ఈ సంక్షోభం నుండి బయటపడలేరని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.190`210 మధ్య ధర ఉందని, మీ ప్రతిపాదన ప్రకారం రూ.180 కూడా రాదని పేర్కొన్నారు. నెల రోజుల క్రితం రూ.200 సగటు ధర ఇవ్వాలని చెప్పినా అదికూడా అమలుకు నోచుకోలేదని, ఈ స్థితిలో పొగాకు రైతులను ప్రభుత్వమే ప్రత్యక్షంగా రంగంలోకి దిగి ఆదుకోవాలని కోరారు. పొగాకు బోర్డు దగ్గర ఆర్డర్లు తెచ్చుకొని నమోదైన కంపెనీలు 34 కాగా 18 కంపెనీలు మాత్రమే ఇప్పటికీ కొనుగోలు చేస్తూ ఉన్నాయని, ప్రభుత్వం కొనుగోలు చేయని కంపెనీలను రంగంలోకి దింపాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1000 కోట్లు సొసైటీకి కేటాయించి కొనుగోలు ప్రారంభిస్తే ఇతర కంపెనీలు కూడా పోటీపడి అనివార్యంగా ధరలు పెంచి కొనుగోలు చేయవలసి వస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సొసైటీకి రూ.1000 కోట్లు కేటాయించి, పొగాకు కొనుగోలు ప్రారంభించాలని, పొగాకు రైతుల ఆందోళన విరమించేటట్లు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరావు ఈ లేఖలో సిఎంను కోరారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్