ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మాయదారి పరదాలు

54 నిమిషాల క్రితం

parada
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 03:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

మసక మబ్బులు కమ్మిన

కటిక సీకటి ఆకసంలా

మసిబారిపోయిన మీ ఇళ్లకు

రంగురంగుల ఇంద్రధనుస్సుల్లా

రమ్యకాంతులు రప్పించడానికి మేమే కావాలి!

పాసిపోయిన మీ గిన్నెలూ గలాసుల్ని

నిత్యం పాలపుంతల్లా

మిలమిలా మెరిపించడానికి మేమే కావాలి!

కదలడానికి మొండికేసిన మీ ఖరీదైన రాజహంసల్ని

రయ్యి రయ్యిని రహదార్ల మీద

పరుగులెట్టించడానికీ మేమే కావాలి!

సిట్టసివరికి మీ ఇంటి గేటుముందల

ఎండా వానల మొండి ముళ్లను

లెక్కసెయ్యని సైనికుల్లా

పడిగాపులు కాయడానికీ మేమే గావాలి!

అయినా మా కూలీ క్యాంప్

బస్తీ వాసుల బతుకు బిశానాల్లో మాత్రం

ఎక్కడ తీసిన గొంగళి అక్కడే ఉండాలి!

ఎప్పటికీ ఇలాగే... ఈ మురికివాడల్లోనే...

మా బిడ్డల కలలన్నీ వూడిపోయిన

గోడ పెచ్చుల్లా మట్టికొట్టుకుపోవాలి!

మీ గత్తరంతా మా నెత్తుల మీద

పులుముకొని తెల్లతెల్లని

మల్లె పువ్వుల్లా మిమ్మల్ని ఇస్త్రీ సేసి

దేశమ్మీదకి వదుల్తున్న పాపానికి

మేం మాత్రం మురికి పందుల్లా

ముక్కి మూల్గుతూ సావాలి!

ఇదే గదా మీ ఆంతర్యం!

ఇదే గదా మీ అసలు కుతంత్రం!

లేకుంటే ఇన్నేళ్లు గడిసినా

ఇంత జీడీపీ వృద్ధిరేటుని గడించినా

ఈగల్తో దోమల్తో రోగాల్తో రోస్టుల్తో

సుస్తీ పట్టిన కుళ్లుకుక్క లాంటి మా బస్తీ బతుకుల్ని

సక్కదిద్దడానికి బదులు

ఇలాగ అందమైన పరదాలు మాటున

మరుగు పరసడం దేనికి..!

ఏ సదస్సులు జరిగినా, ఏ సమ్మిట్లు సంభవించినా

ఏ విదేశీ అతిథుల్ని స్వాగతించినా

మా రోత బతుకుల్ని బాగుసెయ్యడం సేతగాక

కనిపించకుండా కప్చేయడం దేనికి?

కోరుకున్న అభిరుద్ధి నమూనా అదేనా..!

సరే, అదే అయితే అలాగే కానివ్వండి.

నిండా మునిగినోళ్లం, మాకు సలేటి!

పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ

లోకం సూడదనుకుంటే దాని భ్రెమ!

ప్రెపంచం సూస్తంది కీలెరిగి వాత పెట్టే

కాలం కోసం కాపు కాస్తంది!

- పతివాడ నాస్తిక్

94417 24167

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్