- సమీక్షలో సిఎం చంద్రబాబు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో వర్షాల కారణంగా వస్తున్న ప్రవాహాలతో అన్ని నీటి వనరుల్ని నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కృష్ణా, గోదావరి డెల్టాలోని రిజర్వాయర్లతో పాటు వాటి పరిధిలో ఉన్న వివిధ నీటి వనరుల్ని నింపాలని, అవసరమైన చోట మోటార్లను వాడి నీటిని లిఫ్ట్ చేయాలని అన్నారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షలో ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగం, డేటా అనలిటిక్స్, ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే వ్యూహాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్ష ప్రభావంపై ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తీవ్ర వాయుగుండం కారణంగా రాష్ట్రంలో గడచిన మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భూగర్భజలాలు కొంత మేర పెరిగాయని అధికారులు సిఎంకు వివరించారు. ప్రకాశం బ్యారేజి సహా మున్నేరు సహా ఇతర క్యాచ్ మెంట్ ఏరియా నుంచి 11 వేల క్యూసెక్కుల నీరు వస్తోందన్నారు. . రాష్ట్రంలోని 16 జిల్లాల్లో వర్షాలు అధికంగా నమోదు అయ్యాయని అధికారులు వివరించారు. ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, కాకినాడ, ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ సహా వివిధ జిల్లాల్లో తీవ్ర వర్ష ప్రభావం కనిపించిందని తెలిపారు. తాజా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టేలా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏలేరు రిజర్వాయర్‌కు 21,200–26,500 క్యూసెక్కుల మేర, తాండవకు 6,000–7,500 క్యూసెక్కులు, మేఘాద్రిగడ్డకు 2,400–3,000 క్యూసెక్కులు, పంపాకు 3,100–3,875 క్యూసెక్కులు వరకు ఇన్‌ఫ్లో వస్తుందని అంచనా వేస్తున్నారు. గొట్టా బ్యారేజీకి సెప్టెంబర్ 25 ఉదయం నాటికి వార్నింగ్ లెవల్–1 చేరుకునే అవకాశం ఉందని అంచనా వేశారు.
భూసారాన్ని పెంచాలి
ఎల్‌నినో వంటి వాతావరణ పరిస్థితులను మార్చడం సాధ్యం కాకపోయినా.. వాటి ప్రభావాన్ని తగ్గించేలా అంతర్గత పరిస్థితులను మార్చుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. భూసారాన్ని పెంచడం, సాయిల్ టెస్టింగ్ ఆధారంగా ప్రత్యామ్నాయ పంటలను సూచించడం, బయోచార్, ప్రకృతి వ్యవసాయం వంటి విధానాల ద్వారా ఎల్‌నినో ప్రభావాన్ని కొంతమేర తగ్గించవచ్చని తెలిపారు. ఈ విధానాన్ని రాష్ట్రంలో పైలట్‌గా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అక్టోబరు 2 తేదీన ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కు శంకుస్థాపన చేయనున్నామని, అదే రోజు రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామన్నారు. భూగర్భజలాలు సహా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలపైనా అమెరికాలోని పృథ్వీ అనే యువకుడు రూపోందించిన యాప్‌లను పరిశీలించారు. వివిధ శాఖల నుంచి సేకరించిన డేటా సెట్లను సమన్వయం చేసుకుంటూ నాసా ఉపగ్రహ చిత్రాలను అనుసంధానం చేస్తూ ఈ యాప్ ను రూపొందించిన పృథ్విని అభినందించారు. విద్యుత్ టారిఫ్‌ను పెంచకపోయినా సేవల్లో లోపాల కారణంగా ప్రజల్లో సంతృప్తి తగ్గుతోందని, సరఫరా నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో 287.214 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉన్న నేపథ్యంలో.. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నీటి లభ్యతపైనా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఇసుక లభ్యత ధరలు, సరఫరాపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. శాప్ ఆధ్వర్యంలో ఏడాది క్రీడా క్యాలెండర్‌ను రూపొందించాలని ఆదేశించారు.








కామెంట్‌లు (0)