సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

స్వదేశీ పరిజ్ఞానంతో ఆహార భద్రత

1 గంట క్రితం

vice president
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 25, 2026, 12:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఉప రాష్ట్రపతి సిపి.రాధాకృష్ణన్‌

​ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి : విదేశీ హైబ్రీడ్ విత్తనాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, స్వదేశీ పరిజ్ఞానంతోనే ఆహార భద్రతను సాధించడం అత్యంత కీలకమని ఉప రాష్ట్రపతి సిపి.రాధాకృష్ణన్ అన్నారు. జన్యుపరంగా మార్పు చేయని (నాన్-జిఎంఒ) మొక్కజొన్న వంగడాన్ని ఏలూరు జిల్లా ముసునూరులో ‘గౌర్మెట్ పాప్‌కార్నికా’ సంస్థ ఆధ్వర్యంలో గవర్నర్ జస్టిస్‌ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ‌సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగ మాట్లాడుతూ భారతదేశం భవిష్యత్తులో పాప్‌కార్న్ దిగుమతి చేసుకోకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి పరిశ్రమ ఎదుగుతోందని చెప్పారు. దేశ జిడిపి, స్థూల విలువ జోడింపులో వ్యవసాయ రంగం సుమారు ఐదో వంతు వాటాను కలిగి ఉందని తెలిపారు. 46.1 శాతం మందికి ఉపాధిని, 55 శాతం జనాభాకు జీవనాధారాన్ని అందిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముకగా నిలుస్తోందన్నారు. ఎనిమిది రాష్ట్రాల్లో దాదాపు 17,500 మంది రైతులు 40 వేల ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారని చెప్పారు. భవిష్యత్ వ్యవసాయ సమృద్ధి కోసం దక్షిణ భారత నదుల అనుసంధానం, అన్ని జిల్లాలకు సమగ్ర సాగునీటి సౌకర్యాల కల్పన అత్యంత ఆవశ్యమని తెలిపారు.

ప్రపంచ స్థాయి బ్రాండ్‌గా ఎదగాలి : గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్

ముసునూరులో దేశంలోనే మొట్టమొదటి నాణ్యమైన, నాన్-జిఎంఒ పాప్‌కార్న్ హైబ్రీడ్ విత్తనాలను ఆవిష్కరించడం, ఎనిమిది రాష్ట్రాల ఉత్తమ రైతులకు సన్మానం చేయడం సంతోషకరమని రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. వరి, గోధుమల తర్వాత మొక్కజొన్న దేశంలో మూడో అతి పెద్ద పంటగా నిలుస్తోందని తెలిపారు. భారతీయ వాతావరణానికి అనువైన హైబ్రీడ్ విత్తనాలను అభివృద్ధి చేసి, ఐసిఎఆర్ ప్రశంసలు పొందిన ‘గౌర్మెట్ పాప్‌కార్నికా’ సంస్థను అభినందించారు. అరకు కాఫీ లాగే ఈ పాప్‌కార్న్ కూడా ప్రపంచ స్థాయి బ్రాండ్‌గా ఎదగాలని ఆకాంక్షించారు.

​​రైల్వే స్టేషన్లలో ఆంధ్రా పాప్‌‌కార్న్, అరకు కాఫీ స్టాల్స్ : సిఎం చంద్రబాబు

మన రాష్ట్రంలోని వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి విలువ జోడించే ప్రక్రియను చేపడతామని, ఆంధ్రా పాప్ కార్న్ తినేలా, అరకు కాఫీ తాగేలా రైల్వే స్టేషన్లల్లోనూ కౌంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్రక్రియ ద్వారా ఉత్పత్తులకు విలువ పెరిగి, రైతులకు ప్రయోజనం కలిగి సంపద సృష్టికి ఆస్కారం ఉంటుందన్నారు. భారత నేలపైనే గౌర్మెట్ పాప్‌కార్నికా సంస్థ దేశీయంగా జన్యుమార్పిడి జరగని విత్తనాలను రైతులతో కలిసి ఉత్పత్తి చేసిందన్నారు. నూజివీడు గడ్డ నుంచే పండే పాప్ కార్న్ మొక్కజొన్న దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలతో పాటు ఇతర దేశాలకూ ఎగుమతి అవుతోందని తెలిపారు. నూజివీడు సమీపంలోని ముసునూరు వద్ద దేశంలోనే అతిపెద్ద పాప్ కార్న్ ప్రాసెసింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు. పసుపు, మిరప, మొక్కజొన్న, ఆక్వా తదితర ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌కు చేరాలన్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న వాటిలో కేవలం పది శాతం మాత్రమే ప్రాసెసింగ్ చేయగలుగుతున్నామని తెలిపారు. రాయలసీమను ఉద్యాన పంటల హబ్ గా మార్చేలా కార్యాచరణ చేపట్టామన్నారు. రూ.35 వేల కోట్లతో 36 సాగు ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని తెలిపారు. చింతలపూడి ప్రాజెక్టును పూర్తి చేస్తే ఈ ప్రాంత భవిష్యత్తు మారుతుందన్నారు. వెలిగొండ ప్రాజెక్టును ఈ నెలాఖరులోనే ప్రారంభించి జాతికి అంకితం ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, కొలుసు పార్థసారథి, కె.అచ్చెన్నాయుడు, గౌర్మెట్ పాప్‌కార్నికా సంస్థ ప్రతినిధులు వెంకటేశ్వరబాబు, మహీధర్ రెడ్డి, యుగంధర్, ప్రిఫర్డ్ పాప్ కార్న్ ఇఇఒ నార్మ్ కూర్గ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాప్ కార్న్ ఉత్పత్తిలో విశేష సేవలందించిన రైతులను ఉప రాష్ట్రపతి ఘనంగా సన్మానించారు. అతిధులను దుశ్శాలువ, కొండపల్లి బొమ్మలతో గౌర్మెట్ పాప్‌కార్నికా సంస్థ సన్నానించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్