సోమవారం, 05 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‌న్యూ ట్రెండింగ్‌.. ఈ బుక్‌ రేవ్‌!

2 గంటల క్రితం

‌న్యూ ట్రెండింగ్‌.. ఈ బుక్‌ రేవ్‌! image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 06:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్‌ అయ్యింది. లాంతరు లైట్ల కాంతిలో పుస్తకాలు ముందేసుకుని కొంతమంది యువతీయువకులు, పెద్దలు, పిల్లలు చదువుకుంటున్నారు. వారికి కొంచెం పక్కగా క్లబ్‌లో సంగీతం వాయించే డీజే మాదిరి ఒకరు, పెద్ద పెద్ద శబ్దాలు లేని శ్రావ్యమైన సంగీతాన్ని ప్లే చేస్తున్నారు. చూడడానికి ఇది ఏదో రేవ్‌ పార్టీ లాగా, క్లబ్‌లాగా కనిపిస్తోంది. కానీ అక్కడ జరిగే వాటికి భిన్నంగా ఇక్కడ అందరూ పుస్తకాలు చదువుతున్నారు. ఇది జపాన్‌లో మొదలైన కొత్త ట్రెండ్‌. ‘జుకీ బుక్‌ రేవ్‌’ పేరుతో ఈ వీడియో వైరల్‌ అయ్యింది.

క్లబ్‌లాంటి వాతావరణంలో నేలంతా తివాచీలు పరిచిన ఈ చోటు టోక్యోలోని షిమోకిటజావా అనే ‘అండర్‌గ్రౌండ్‌ పుస్తకాల క్లబ్‌’. పుస్తక ప్రేమికులందరూ ఈ ‘రీడింగ్‌ రేవ్‌’లకు తమకు నచ్చిన పుస్తకం తీసుకుని వచ్చి, నచ్చిన చోట కూర్చొని చదువుకుంటారు. సాధారణ పుస్తకాల క్లబ్‌ మాదిరి ఇక్కడ ఒకే పుస్తకాన్ని అందరూ చదవాల్సిన పనిలేదు. కొన్ని ‘రీడింగ్‌ రేవ్‌’లలో జర్నలింగ్‌, స్కెచింగ్‌, పుస్తకాల మార్పిడి వంటి కార్యక్రమాలతోపాటు, తమకు నచ్చిన పనులు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు.

ఈ ‘పుస్తకాల రేవ్‌’లు జపాన్‌లో మాత్రమే కాదు. ప్రపంచమంతా కనిపిస్తున్నాయి. మన దేశంలోనే ఇంకా మొదలవ్వలేదు. ఆమ్‌స్టర్‌డామ్‌లో ఇలాంటి ‘రీడింగ్‌ రేవ్‌’ గురించిన వీడియో ఈ ఏడాది ప్రారంభంలో వైరల్‌ అయ్యింది. ఆ వీడియోలో ‘ఎన్‌ఈఎంఓ సైన్స్‌ మ్యూజియం’ రూఫ్‌టాప్‌పై డజన్లకొద్దీ పుస్తకప్రియులు చదువుకుంటూ కనిపించారు. మెల్‌బోర్న్‌లో ‘బుక్‌ డూఫ్‌’ అనే సంస్థ బార్‌లు, లైబ్రరీలు వంటి చోట్ల కూడా ‘రీడింగ్‌ రేవ్‌’లను నిర్వహిస్తోంది.

పాత తరానికి పుస్తక పఠనం కొత్త కాదు.. కానీ కొత్త తరానికి మాత్రం పుస్తకాలను పరిచయం చేయడానికి ఇలాంటి వినూత్న ప్రయత్నాలు అవసరం. ఆన్‌లైన్‌, సోషల్‌ మీడియా ప్రభావంతో పుస్తక పఠనానికి దూరమవుతున్న యువతను మళ్లీ పుస్తకాల వైపు ఆకర్షించేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయి. పుస్తకాలు చదవడం మాత్రమే కాదు.. వాటి చుట్టూ కూడా ఎన్నో ఆసక్తికరమైన కార్యక్రమాలు నిర్వహించవచ్చని, పుస్తకాలపై తమ ప్రేమను మరో రూపంలో వ్యక్తం చేయవచ్చని ఈ ‘రీడింగ్‌ రేవ్‌’లు చాటుతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్