- సిఎంకు సిపిఐ లేఖ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయడానికి అవసరమైన నిధులను తక్షణమే కేటాయించి, నిర్వాసిత రైతులకు ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం న్యాయమైన పరిహారం అందించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఆయన ఆదివారం లేఖ రాశారు. ఈ ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి తగిన చర్యలు లేఖలో కోరారు. ఇప్పటి వరకూ కేవలం 40 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని, పోలవరం, చింతలపూడి, నూజివీడు, తిరువూరు ప్రాంతాలలో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోతుండగా, రైతులు 500 అడుగులకు పైగా బోర్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ పరిస్థితుల్లో చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తికాకపోతే భవిష్యత్తులో వ్యవసాయం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం భూసేకరణ సమస్యలు ఈ ప్రాజెక్టు పూర్తి కావడంలో ప్రధాన అడ్డంకిగా మారిందని తెలిపారు. ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఇంకా గణనీయమైన భూమిని సేకరించాల్సి ఉందని పేర్కొన్నారు. జూన్ 2028 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యాన్ని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో ప్రకటించడం ఆశాజనకమైన అంశం అయినప్పటికీ భూసేకరణ ప్రక్రియలో రైతులకు తగిన పరిహారం అందకపోవడం వల్ల అనేక ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయని తెలిపారు.









కామెంట్‌లు (0)