ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఒడెస్సా నౌకాశ్రయంలో మరో నౌకపై దాడి.. ఇద్దరు భారతీయులు గల్లంతు

1 గంట క్రితం

Indian embassy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 04:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కీవ్ : ఉక్రెయిన్‌లోని నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నౌకాశ్రయంలో మరో సరుకు రవాణా నౌకపై క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటనలో ఎంవీ ఏజీఎన్ రాగ్నార్ నౌకలోని ఇద్దరు భారతీయ నావికులు గల్లంతయ్యారని, ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. నౌకలో మొత్తం నలుగురు భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం ఈదాడి జరిగిందని, గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. క్షిపణి దాడికి పాల్పడినది ఎవరనేది తెలియలేదని అన్నారు.

జూలై 19న గినియా-బిస్సావు జెండాతో ప్రయాణిస్తున్న ఎంవీ గోల్డెన్ లియో నౌకపై జరిగిన క్షిపణి దాడిలో పది మంది నావికులు మరణించిన సంగతి తెలిసిందే. మృతుల్లో నలుగురు భారతీయులు ఉన్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. తూర్పు ఆసియా సదస్సు సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో సమావేశమై భారతీయ నావికుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్, ఉక్రెయిన్‌కు ఆయుధాలు, మందుగుండు సామగ్రి తరలిస్తున్న నౌకలపై రష్యా దాడులు కొనసాగిస్తుందని పేర్కొన్నారు. అయితే, గోల్డెన్ లియో పూర్తిగా ధాన్యం రవాణా చేస్తున్న పౌర వాణిజ్య నౌకేనని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. వాణిజ్య నౌకలు, నావికులపై ఎట్టి పరిస్థితుల్లోనూ దాడులు జరగకూడదని భారత్ పునరుద్ఘాటించింది. భారతీయుల వివరాల కోసం ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్‌ను కూడా అందుబాటులో ఉంచింది. అత్యవసర పరిస్థితుల్లో cons.kyiv@mea.gov.in, cons1.kyiv@mea.gov.in ఈమెయిల్‌లతో పాటు +380 93 355 9958 (శ్రీ అజి కుమార్, కాన్సులర్ విభాగం)ను సంప్రదించాలని సూచించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్