న్యూఢిల్లీ : అంతర్జాతీయ వాణిజ్యనౌకల్లో పనిచేసే భారత నావికులకు కేంద్ర విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది. నల్ల సముద్ర ప్రాంతంలో పనిచేస్తున్న లేదా దాని ద్వారా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలలో ఉద్యోగాలకు అంగీకరించే ముందు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ సముద్ర మార్గంలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, వాణిజ్య నౌకలపై తరచూ క్షిపణి.. డ్రోన్ దాడులు జరుగుతున్నాయని తెలిపింది. తాజాగా ఉక్రెయిన్‌లోని ఒడిశా తీరంలో భారత నావికులతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై దాడి నేపథ్యంలో ఈ హెచ్చరికలు చేసింది. ఈ దాడిలో ఇద్దరు భారతీయులు గల్లంతయినట్టు సమాచారం. మరో ఇద్దరు భారతీయులు క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. నల్లసముద్ర మార్గాల్లో దాడుల వల్ల ఏప్రిల్ 2026 నుంచి ఇప్పటికే ఐదుగురు భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారని విదేశాంగ శాఖ వెల్లడించింది. నల్ల సముద్రం.. దానిని ఆనుకుని ఉన్న ఓడరేవుల్లో విధులను అంగీకరించే ముందు ప్రమాదాలను జాగ్రత్తగా అంచనా వేయాలని నావికులకు సూచించింది. నౌకా మార్గాలు, భద్రతా ఏర్పాట్లు, బీమా సౌకర్యం, అత్యవసర విధానాలు, ఉద్యోగ నిబంధనలను సరిచూసుకోవాలని పేర్కొంది. ప్రయాణ వివరాలను ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ... వారితో సంప్రదింపులు జరపాలని కోరింది. సముద్రయాన అధికారులు జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఉన్న సమయంలో ఏదైనా సహాయం అవసరమైతే అత్యవసర నంబర్ల ద్వారా ఆ ప్రాంతంలోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరపాలని పేర్కొంది.
నల్ల సముద్ర ఓడరేవుల్లో పనికి వెళ్లే ముందు జాగ్రత్తలు తీసుకోండి : కేంద్రం అడ్వైజరీ
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 26, 2026, 03:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)