mh ad
శనివారం, 20 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పొగాకుకు గిట్టుబాటు ధర కోసం ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

17 గంటల క్రితం

rally
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 20, 2026, 12:59 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ఒంగోలులో కదంతొక్కిన రైతులు

​ప్రజాశక్తి - ఒంగోలు సిటీ : పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన రైతులు శుక్రవారం ఒంగోలులో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. సంయుక్త కిసాన్ మోర్చా, రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ భారీ ట్రాక్టర్ ర్యాలీ దక్షిణ భారతదేశంలోనే పొగాకు రైతులతో జరిగిన అతి పెద్ద నిరసన ప్రదర్శనగా నిలిచింది. ర్యాలీకి వామపక్ష పార్టీలు, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు ప్రకటించాయి. వందలాది ట్రాక్టర్లు, దాదాపు వెయ్యి మోటార్‌ సైకిళ్లతో రైతులు ఒంగోలు నగరంలో ప్రదర్శన నిర్వహించారు. ప్రధాన రహదారులు గంటల తరబడి దిగ్బంధనానికి గురయ్యాయి.టొబాకో బోర్డు సమీపంలోని మినీ స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీ నెల్లూరు బస్టాండ్‌, ప్రకాశం భవన్‌, చర్చ్‌ సెంటర్‌, ట్రంక్ రోడ్డు , మార్కెట్‌ సెంటర్‌, అద్దంకి బస్టాండ్‌, కర్నూలు రోడ్, పవర్‌ ఆఫీస్‌ మీదుగా ఒంగోలు బైపాస్‌ వరకు కొనసాగింది. సిఎం చంద్రబాబు గురువారం పొగాకు సమస్యపై సమావేశం నిర్వహించి కిలోకు రూ.200 కంటే తక్కువ ధర ఉండకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటించినప్పటికీ రైతుల్లో నమ్మకం కలగకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళనకు తరలివచ్చారు.

రూ.వెయ్యి కోట్లు కేటాయించలేరా?

తొలుత మినీ స్టేడియం వద్ద సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్‌ చుండూరు రంగారావు అధ్యక్షతన జరిగిన సభలో పలువురు రైతు సంఘాల నాయకులు ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లకు వివిధ పన్నుల రూపంలో ఏటా లక్ష కోట్ల రూపాయలకుపైగా ఆదాయం సమకూర్చుతున్న పొగాకు రైతులను ఆదుకునేందుకు కనీసం రూ.వెయ్యి కోట్లు కేటాయించలేకపోవడం సిగ్గుచేటన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో రూ.500 కోట్లు కేటాయించి ప్రభుత్వరంగ సంస్థలైన ఎస్‌టిసి, మార్క్‌ఫెడ్‌, సహకార సమాఖ్యల ద్వారా పొగాకు కొనుగోలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. క్వింటాలు పొగాకును కనీసం రూ.30 వేల ధరకు కొనుగోలు చేసే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.

రైతులను దగా చేయడమే : ఎం.ప్రభాకరరెడ్డి

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తి వ్యయం కిలోకు రూ.250కు చేరుకుందని, అలాంటి పరిస్థితుల్లో రూ.200 ధర ప్రకటించడం రైతులను దగా చేయడమేనని విమర్శించారు.

రైతులను ఢిల్లీ పంపాలి : గుజ్జుల ఈశ్వరయ్య

ఎపి రైతు సంఘం (దాసరి భవనం) రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గాన్ని ఢిల్లీ పంపుతామని ప్రకటించడం సరిపో దని, పొగాకు రైతులు, రైతు సంఘాల ప్రతినిధులను కేంద్రంతో చర్చలకు పంపాలని డిమాండ్ చేశారు. చివరి ఆకు వరకు కొనుగోలు చేస్తామని ప్రకటించిన వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చిన హామీ అమలుకు నోచుకోవడం లేదన్నారు. కూటమి పార్టీల నేతలు లేఖలు రాసి చేతులు దులుపుకోవడం కాకుండా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జిఎస్టీ ఆదాయం పెరిగినా రైతులకు న్యాయం ఎక్కడ? : వి.కృష్ణయ్య

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై జిఎస్టీని 28 శాతం నుంచి 40 శాతానికి పెంచిందన్నారు. గత ఏడాది జిఎస్టీ రూపంలో కేంద్రానికి రూ.28 వేల కోట్లు, రాష్ట్రానికి రూ.7 వేల కోట్లు ఆదాయం సమకూరగా, ఈ ఏడాది కేంద్రానికి రూ.40 వేల కోట్లు, రాష్ట్రానికి రూ.10 వేల కోట్లు వచ్చే పరిస్థితి ఉందని తెలిపారు. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జుజ్జురి జయంతి బాబు, జిల్లా అధ్యక్షులు పమిడి వెంకటరావు, రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు సివి సాగర్, వి హనుమారెడ్డి, కె వీరారెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్ కె మాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్