ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబిగ్ బ్యాంగ్

02 ఆగస్టు, 2026

kavitha ku photo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 02, 2026, 07:53 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

నా కలం గుండె బలం

పోరాట జీవన కాగితంపై

ఓటమి నిశీధిని బంధించి,

విజయోదయానికి తొలి

అక్షరకిరణమై నిలువగలదు..!

నా కవన ఆత్మవిశ్వాసం

నవ సమాజ గగనతలంపై

గెలుపు పరిమళ చరిత్రను లిఖిస్తూ,

కాలపు కనురెప్పలపై ఆశయ

దీపావళిని వెలిగించగలదు..!

నా గళం మనోధైర్యం

అవమానాల అగ్నిపర్వతాలను

అవలీలగా బద్దలు కొట్టి,

ఆత్మగౌరవ జలధారలను

ప్రవహింపజేయగలదు..!

నా సహనం బిగ్ బ్యాంగ్

విశ్వ నిశ్శబ్ద గర్భంలో జనించిన

సృజనాత్మక విస్ఫోటన శక్తిలా,

మానవీయ పతాకమై

సమానత్వ లౌకికవాద

శిఖరాలను నిర్మించగలదు..!

నా మౌన స్ఫూర్తి గీతం

మత సామరస్య శూన్యంలో

కాంతి వేగంతో పయనించి,

కాల హృదయంలో కరుణా

నక్షత్రమై ప్రకాశించగలదు..!

నా ఆలోచన తార్కిక జ్యోతి

అజ్ఞాన అంధకార గుహల్లో

సత్యాన్వేషణ శంఖాన్ని పూరిస్తూ,

విజ్ఞాన విప్లవానికి వేదిక కాగలదు..!

నా స్వప్నం కేవలం కల కాదు,

రేపటి మానవ చరిత్రకు

మానవీయ వనంలో పెరుగుతున్న

చైతన్య విత్తనం..!

సత్యం నా సంతక సంకేతం

ప్రేమ నా సందేశ సాంకేతికం

శాంతి నా సమర నినాదం

మానవత్వం నా మత వికాసం

సమానత్వం నా శాశ్వత ప్రమాణం..!

నేనో అరుణోదయ ఆకాశం,

అనంత ప్రకాశ తాత్విక వర్ణం.

నేనో నిరంతర ఉద్యమ తరంగం,

కాల గమనాన్ని ప్రశ్నించే

జీవన జిజ్ఞాస స్వరనాదం..!

​ఫిజిక్స్ అరుణ్ కుమార్

9394749536

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్