కోసల రాజుకు పశుపక్ష్యాదులు అంటే చాలా ఇష్టం. రాజు ఉద్యానవనంలో విహరిస్తుండగా ఒక అరుదైన పక్షి ఆ తోటలో చిత్ర విచిత్ర స్వరాలతో సుస్వరాలు పలుకుతూ చెట్లపై నుంచి ఎగురుతూ కనిపించింది. దాన్ని చూసి ముచ్చటపడ్డ రాజు వెంటనే దాన్ని బంధించి, తన మందిరంలో అలంకారప్రాయంగా పంజరంలో పెట్టాడు. దానికి ప్రపంచంలో దొరికే రకరకాల పండ్లను పెట్టేవాడు. అది అంత ఆనందంగా ఆ పళ్ళని తినేది కాదు. కొన్ని రోజులు గడిచాయి.
ఒకరోజు రాజు సేద గృహంలో సేద తీరుతుండగా సేనాధిపతి పరుగు పరుగున వచ్చి "రాజా! మన రాజ్యంపై అంగరాజు దండెత్తి వస్తున్నాడు" అని చెప్పాడు. రాజుకు చాలా కోపం వచ్చింది.
"ఆ అంగరాజుకు మన పైనే దండెత్తి వచ్చేంత బలం ఎక్కడి నుంచి వచ్చింది?" అని ప్రశ్నించాడు.
"రాజా! అతనికి మన శత్రురాజు సహాయం చేస్తున్నాడు. ఆ బలం చూసుకునే మనపై దండెత్తి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు" అన్నాడు. కోసల రాజు తీవ్ర స్వరంతో "ఆ రాజుకు తగిన బుద్ధి చెబుదాం.... వెంటనే యుద్ధాన్ని ప్రకటించండి" అన్నాడు.
సేనాధిపతి యుద్ధ సన్నాహాలు ప్రారంభించాడు. యుద్ధ ఢంకా మోగించారు. శంఖం పూరించారు. భీకరంగా రెండు రాజ్యాల సైన్యం పది రోజులపాటు యుద్దాన్ని కొనసాగించాయి. ఆ యుద్ధంలో కోసలరాజు ఓడిపోయాడు. అతన్ని బంధించి అంగరాజు ముందు ప్రవేశపెట్టారు. అతడు అతన్ని చెరసాలలో బంధించమన్నాడు. అయితే అతనికి ఒక రాజుకు పెట్టగలిగే స్థాయిలోనే భోజనాన్ని అందించమన్నాడు. రాజును చెరసాలలో బంధించి ప్రతిరోజూ, అతనికి ఇష్టమైన ఆహారాన్ని అందించసాగారు. అలా కొన్నిరోజులు గడిచిన తర్వాత ఒకరోజు ఉదయం తన చెరసాల పైన ఉన్న గవాక్షం గుండా పక్షుల కిలకిల రావాలు వినిపించాయి. అప్పుడు రాజుకు హఠాత్తుగా తన మందిరంలో ఉన్న ఆ పక్షి గుర్తుకు వచ్చింది. తాను రకరకాల పండ్లను దానికి అందించినా అది ఎందుకు అయిష్టంగా ఉండేదో తనకు ఇప్పుడు అర్థమవుతూ ఉంది.
కారణం ' సుఖం కంటే స్వేచ్ఛ చాలా గొప్పది' అని అనుకున్నాడు. బహుశా అందువల్లనే ఆ పక్షికి తాను ఎన్ని రకాల పండ్లు పెట్టినా దానికి రుచించేది కాదనిపించింది. రాజుకు పశ్చాత్తాపం మొదలైంది. ఎలాగైనా ఆ పక్షిని వదిలేయాలి అనుకున్నాడు. అయితే 'తానేమో చెరసాలలో ఉన్నాడు ఎలా' అని ఆలోచించాడు. ఆ పక్షి బాగోగులు చూసుకునే ఒకప్పటి భటుడు ఇప్పుడు ఈ చెరసాలలో ఉండటం గమనించాడు. తనకు అనుకూలమైన ఆ భటునికి రహస్యంగా తన మందిరంలో ఉన్న_ పక్షికి విముక్తి కలిగించమన్నాడు. ఆ భటుడు రాజమందిరంలోకి ప్రవేశిస్తుండగా అక్కడ ఉన్న భటులు అతన్ని బంధించారు. అంగరాజు ముందు ప్రవేశపెట్టారు.
ఆ భటున్ని అడిగాడు "నువ్వెందుకు రాజు మందిరంలోకి ప్రవేశించావు . అక్కడ దొంగతనం చేయడానికా"! అన్నాడు.
అందుకు ఆ భటుడు సమాధానం ఇస్తూ "మహారాజా! నేను దొంగతనానికి వెళ్ళలేదు. కోసలరాజు గారి ఆదేశానుసారం వారి మందిరంలో ఉన్న పంజరంలోని పక్షిని విడిపించడానికి వెళ్లాను" అన్నాడు.
అంగరాజు కాసేపు ఆలోచించి కోసలరాజు ఉన్న చెరసాల వైపు నడిచాడు. అక్కడ రాజు పంజరంలో పక్షిలా ముడుచుకుపోయి ఉన్నాడు. అంగరాజును చూసి కోసల రాజు ఇలా అన్నాడు, 'రాజా! రాజభోగాల మధ్య ఉన్నా స్వేచ్ఛ లేకపోతే ఈ జీవితం శూన్యమని నాకు అర్థమైంది. నా అహంకారంతో ఒక అమాయక పక్షిని పంజరంలో బంధించాను. నన్ను శిక్షించు, కానీ ఆ పక్షికి విముక్తి ప్రసాదించు' అని వేడుకున్నాడు. శత్రు రాజులోని ఆ పరివర్తన, స్వేచ్ఛ పట్ల అతనికి కలిగిన గౌరవం చూసి అంగరాజు చలించిపోయాడు. వెంటనే సంకెళ్లు విప్పించి, 'స్వేచ్ఛ విలువ తెలిసిన వాడే నిజమైన పాలకుడు. మనం ఎన్ని సంపదలు ఉన్నా స్వేచ్చ లేకపోతే అది ఎంత దుర్భరంగా ఉంటుందో_ అర్థమైంది. స్వేచ్ఛకు మించిన ఆనందం ఏ సుఖములోనూ లేదని తెలుసుకున్నాను. మిమ్మల్ని బంధించే అర్హత నాకు లేదు' అంటూ సగర్వంగా విడిచిపెట్టాడు."
జి.పి. రామ్ చంద్
98495 31202








కామెంట్‌లు (0)