- దెబ్బతిన్న రోడ్లకు అత్యవసర మరమ్మతులు
- సమీక్షలో మంత్రి కె.అచ్చెన్నాయుడు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల ప్రభావం, తక్షణం చేపట్టాల్సిన చర్యలపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లతో మంత్రి టెలీకాన్ఫరెన్స్‌ను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖలు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. దెబ్బతిన్న రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల నష్ట వివరాలను సేకరించి, అత్యవసర పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యాన పంటలకు జరిగిన నష్టంపై క్షేత్రస్థాయిలో వెంటనే సర్వే చేపట్టి, నష్ట వివరాల నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పొలాల్లో నీరు నిలిచిన ప్రాంతాలను సంబంధిత అధికారులు సందర్శించి, పంటల పరిస్థితిని పరిశీలించాలన్నారు. నిల్వ నీటిని తొలగించడం, అధిక తేమ వల్ల మరింత నష్టం వాటిల్లకుండా నివారించడం వంటి అంశాలపై రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు అందించాలని సూచించారు. పంటల రక్షణకు అనుసరించాల్సిన పద్ధతులపై క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. వర్షాలు, గాలులకు దెబ్బతిన్న రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల వివరాలను వెంటనే నమోదు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించే ముఖ్యమైన రహదారులను గుర్తించి, అత్యవసర మరమ్మతులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, ప్రస్తుతం కురుస్తున్న వర్షాల ద్వారా లభిస్తున్న నీటిని సాధ్యమైనంత మేర సంరక్షించి, చెరువులు, జలాశయాలు, ఇతర నీటి వనరుల్లో నీటిని నిల్వ చేసి, భవిష్యత్తు సాగు, తాగునీటి అవసరాలకు సమర్థంగా వినియోగించుకునేలా పక్కా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్లను ఆదేశించారు.








కామెంట్‌లు (0)