- మోడీ విధానాలపై పోరాటాలు ఎక్కు పెట్టాలి
- కేంద్రం పాలసీలలో టిడిపి భాగస్వామ్యం
- ఎఐకెఎస్ సహాయ కార్యదర్శి టి సాగర్
- ఉత్సాహంగా ఎపి రైతు సంఘం మహాసభ ప్రారంభం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి-బడా సుబ్బిరెడ్డి, వై. జోయా నగర్ (ఏలూరు): ఒక వైపు యుద్ధోన్మాదం మరో వైపు టారిఫ్ టెర్రరిజం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో సామ్రాజ్యవాదం ప్రపంచంపై బరి తెగించి క్రూర దాడికి పాల్పడుతుండగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం లొంగిపోయి వత్తాసు పలుకుతోందని అఖిల భారత కిసాన్ సభ (ఎఐకెఎస్) సహాయ కార్యదర్శి టి సాగర్ చెప్పారు. అమెరికా సామ్రాజ్యవాదం, మోడీ విధానాలపై రైతులు కలిసొచ్చే ఇతర వర్గాలు, సంఘాలతో కలిసి ఐక్య పోరాటాలను ఎక్కుపెట్టి మెడలు వంచాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి మద్దతిచ్చి నిలబెడుతున్న టిడిపి భాగస్వామ్యం రైతు, ప్రజా వ్యతిరేక విధానాల అమలులో ఉందన్నారు. జూలై 3-5 మూడు రోజుల పాటు ఏలూరులో జరుగుతున్న ఎపి రైతుసంఘం 23వ మహాసభ శనివారం సీనియర్ నాయకులు వై కేశవరావు పతాకావిష్కరణతో ఉత్తేజపూరితంగా ప్రారంభయ్యాయి. శుక్రవారం ప్రదర్శన, బహిరంగసభ నిర్వహించగా రెండవ రోజు శనివారం ఎఐకెఎస్ నాయకులు టి. సాగర్ ప్రారంభోపన్యాసంతో రైతుల నినాదాల మధ్య మహాసభ ఆరంభమైంది. మహాసభ జరుగుతున్న డిసిఎంఎస్ హాలుకు బడా సుబ్బిరెడ్డి, వై జోయా నగర్‌గా నామకరణం చేశారు. ఇరాన్‌పై అమెరికా దాడి, అమెరికా మద్దతులో పాలస్తీనాపై ఇజ్రాయిల్ పాశవికత, అమెరికా మద్దతుతోనే రష్యాపై ఉక్రెయిన్ యుద్ధం, వెనిజులా అధ్యక్షుని అక్రమ నిర్బంధం సామ్రాజ్యవాదం దాష్టీకాలలో కొన్ని ఉదాహరణలని సాగర్ చెప్పారు... ఎక్కడో యుద్ధం వస్తే మనకేం సంబంధం అనుకోవడం పొరపాటు. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో మన దేశంలో పెట్రో ఉత్పత్తులు సహా సమస్త వస్తువుల ధరలూ పెరిగాయి. అమెరికాతో త్వరలో సంతకాలు జరగబోయే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు మన రైతులను దెబ్బతీస్తాయి. ఒప్పందాల్లో భాగంగా మోడీ సర్కార్ దిగుమతి సుంకాలు ఎత్తేస్తే, తగ్గిస్తే దేశంలోకి పాల, వ్యవసాయ ఉత్పత్తులు వరదలా పడతాయి. ఇంకా ధరలు పతనమై రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. గతంలో చేసుకున్న యూరోపియన్ యూనియన్, న్యూజిలాండ్ ఒప్పందాలతో రైతులకే కాదు అశేష ప్రజానీకానికీ నష్టం. అదానీ, అంబానీ, ఐటిసి వంటి వారికి, విదేశీ బహుళజాతి సంస్థలకు లాభం. దీన్నిబట్టి మోడీ సర్కార్ కార్పొరేట్ల పక్షమని తెలుస్తుంది. అగ్రిమెంట్లకు వ్యతిరేకంగా పోరాటంలో అందరినీ కలుపుకోవాలి. రాబోయే రోజుల్లో ఈ ఒప్పందాలపై పోరాటాలే మనకు లక్ష్యంగా ఉండాలి.
విద్యుత్ సవరణ అందరికీ భారం
విద్యుత్ సవరణ చట్టం రైతులకే కాదు అందరికీ నష్టం చేస్తుందని సాగర్ వివరించారు... విద్యుత్ ప్రైవేటీకరణ జరిగితే, స్మార్ట్ మీటర్లు పెడితే ఇప్పుడు నెలకు బిల్లు రూ.200 వచ్చేది కాస్తా 1,200 వస్తుంది. స్మార్టు మీటర్లను బీహార్‌లో రైతులు వ్యతిరేకిస్తే వెనక్కి తగ్గారు. ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి కూటమి సర్కార్ సై అంటోంది. ప్రైవేటీకరణ విషయంలో మోడీ తందానా అంటే చంద్రబాబు తానే తందానా అంటున్నారు. కొన్ని విషయాల్లో మోడీ చెప్పకముందే సై అంటున్నారు. ఎ.పి.ని ప్రయోగశాలగా మార్చేస్తున్నారు. రైతులకు ఉచిత విద్యుత్ తీసేసేందుకు ఎపి, తెలంగాణాల్లో ప్రత్యేక డిస్కంను నెలకొల్పుతున్నారు. విద్యుత్ సవరణ చట్టంపై రైతులు అందరినీ కలుపుకొని ఉద్యమించేందుకు సిద్ధం కావాలి.
మరో ఉద్యమానికి...
మద్దతు ధరల (ఎంఎస్‌పి)కి గ్యారంటీ చేసే చట్టం, అప్పులతో ఆర్థికంగా చితికిపోయిన రైతులకు రుణ మాఫీ, కేరళలో మాదిరి రుణ విమోచన చట్టం తదితర డిమాండ్ల సాధన కోసం చర్చించేందుకు 500 సంఘాలు ఈ నెల 29న ఢిల్లీలో ఒకే వేదికపైకి రాబోతున్నాయి. భవిష్యత్తు కార్యాచరణ రూపొందుతుంది. క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితో ఆగస్టు 10న దేశ వ్యాప్తంగా గ్రామాలు, మండలాలు, జిల్లా కేంద్రాల్లో జైలు భరో కార్యక్రమాలకు రైతు సంఘం, ఎఐకెఎస్ సమాయత్తం కావాలి. రైతాంగ సమస్యలపై, మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, ప్రత్యామ్యాయాలపై చర్చించి రాబోయే మూడేళ్లకు కార్యాచరణను రూపొందించుకునేందుకు ఎఐకెఎస్ అఖిల భారత మహాసభ వీర తెలంగాణ రైతాంగ పోరాట కేంద్రం నల్గొండలో నవంబర్‌లో జరుగబోతోంది. జయప్రదం చేయాలి. ఈ మధ్యలోనే స్థానిక సమస్యలపై కేంద్రీకరించి పని చేయాలి. అల్లూరి సీతారామరాజు, దొడ్డి కొమరయ్య, మల్లు స్వరాజ్యం వంటి నేతలను స్ఫూర్తిగా తీసుకోవాలి. రైతాంగ పోరాటాలకు పునాది వేసిన ప్రాంతంగా ఏలూరు, పశ్చిమగోదావరికి ఘనమైన చరిత్ర ఉంది. రాష్ట్రంలో నిర్భందాలకు, బెదిరింపులకు లొంగకుండా పలు పోరాటాలు జరిగాయి. ఉద్యమ విస్తరణకు, ప్రతిష్ట పెంపొందించడానికి తోడ్పడ్డాయి. రానున్న కాలంలో ఉద్యమ నిర్మాణానికి మహాసభలో చర్చలు దోహదపడాలి... అని సాగర్ కోరారు. ఎపి రైతుసంఘం అధ్యక్షులు వి క్రిష్ణయ్య అధ్యక్షతన జరగిన ప్రారంభ సభలో ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి రమాదేవి, రైతు కూలీ సంఘం జాతీయ నాయకులు ఎస్ ఝాన్సీ, ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు నంబూరి రామరాజు, ఆయిల్‌పాం రైతు రక్షణ సంఘం నాయకులు రంగారావు మాట్లాడారు. మహాసభ ఫలప్రదం కావాలని ఆకాంక్షించారు. మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు, ఉభయగోదారి జిల్లాల టీచర్స్ ఎంఎల్‌సి బి గోపి మూర్తి స్వాగతోపన్యాసం చేయగా, ఆహ్వానితులకు కె శ్రీనివాస్ వేదిక మీదికి స్వాగతం పలికారు. ఎఐకెఎస్ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్, ఎపి రైతు సంఘం కార్యదర్శి కె ప్రభాకరరెడ్డి, రాష్ట్ర ఆఫీస్ బేరర్లు, ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి బలరాం, ఎం హరిబాబు, నిర్వాసితుల సంఘం నాయకులు మంతెన సీతారాం, ఉపాధ్యాయ ఉద్యమ నేత ఎస్‌కె వలి, ప్రొఫెసర్ ఎం వేణుగోపాలరావు వేదికపై పాల్గొన్నారు. ప్రజా నాట్య మండలి కళాకారులు విప్లవ గీతాలు ఆలపించారు.








కామెంట్‌లు (0)